Rahul Gandhi: అదానీపై అమెరికాలో కేసు.. అది ఎవరి వ్యక్తిగతం కాదన్న రాహుల్ గాంధీ
అదానీ గురించి అడిగిన ప్రశ్నలకు అమెరికాలో ప్రధాని మోదీ (PM Modi) ఇచ్చిన సమాధానాన్ని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి తప్పుపట్టారు. ‘‘నరేంద్ర మోదీజీ.. అది ఎవరి వ్యక్తిగత విషయం కాదు. అది దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశం’’ అని రాహుల్ అన్నారు. శుక్రవారం నాడు యూపీలోని తన సొంత నియోజకవర్గం రాయ్‌బరేలీలో జరిగిన ఒక కార్యక్రమంలో రాహుల్ ఈ విమర్శలు చేశారు.
ఇటీవల అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి (PM Modi) అదానీ గ్రూప్‌పై అమెరికాలో పెట్టిన కేసు గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ట్రంప్‌తో భేటీలో ఈ విషయం కూడా చర్చకు వచ్చిందా? అని ఒక విలేకరి అడిగారు. దీనికి బదులిచ్చిన మోదీ.. ‘‘ఇద్దరు దేశాధినేతలు ఎప్పుడూ వ్యక్తిగత స్థాయి అంశాలను చర్చించరు’’ అన్నారు. ఈ సమాధానాన్ని రాహుల్ (Rahul Gandhi) గతంలో కూడా తప్పుబట్టారు. ‘‘ఈ విషయం గురించి దేశంలో ఎవరైనా ప్రశ్నిస్తే మౌనం దాల్చే ప్రధాన మంత్రి.. విదేశాల్లో అడిగితే అది వ్యక్తిగత విషయమని చెప్తన్నారు’’ అని అప్పుడే తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు.
కాగా, 20 ఏళ్ల కాలంలో 2 బిలియన్ డాలర్లు లాభం వచ్చేలా అధిక ధరకు సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేలా ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ‘ఉన్నత స్థాయి’ వర్గాలకు కొందరు లంచాలు ఇచ్చినట్లు అమెరికాలో కేసులు నమోదయ్యాయి. ఆ నిధులను అమెరికాలో పెట్టుబడుల రూపంలో అదానీ గ్రూప్ (Adani Group) సేకరించడంతో అక్కడ కేసు నమోదైంది. సౌర విద్యుత్ విక్రయ కాంట్రాక్టుల్లో తమకు అనుకూలంగా ఉండే చట్టాలు చేసేందుకు అదానీ గ్రూప్ (Adani Group) 250 మిలియన్ డాలర్ల (రూ.2029 కోట్లు) మేర లంచాలు ఇచ్చిందనేది ఆరోపణ.













