పోలవరం పనులకు తొలగిన అడ్డంకి
ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా పేర్కొంటున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు అడ్డంగి తొలగింది. ఈ ప్రాజెక్టు పనుల్ని మరో ఏడాది పాటు కొనసాగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు అనుమతులు జారీచేసింది. 2018 జులై వరకు పనుల కొనసాగింపునకు కేంద్ర జలవనరుల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. 2015లో ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల అభ్యంతరాల మేరకు పోలవరం పనులను ఆపాలని కేంద్రం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం, అలాగే దానికయ్యే ప్రతి పైసానూ కేంద్ర ప్రభుత్వమే భరిస్తుండటంతో ఈ ప్రాజెక్టు పనుల్ని నిలిపివేయడం మంచిది కాదని జలవనరుల శాఖ అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే.. త్వరితగతిన ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలని కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జలవనరులశాఖకు ఏపీ సీఎం చంద్రబాబు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 1తో గడువు ముగియడంతో దాన్ని వచ్చే ఏడాది జులై 2 వరకు పనుల్ని నిరాటంకంగా కొనసాగించే దిశగా గడువు పొడిస్తూ కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి గురువారం ఉత్తర్వులు జారీ చేయడంతో పోలవరం పనులకు అడ్డంకి తొలగినట్టయింది.













