అధికారం కోసం కాదు… ప్రజల కోసం : పవన్ కల్యాణ్
వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్డుపైకి రావాలంటే భయమేసే పరిస్థితి ఉండేదని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమర్శించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ప్రతినిధుల భేటీలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టాలంటే భయం. ఇంట్లో వాళ్లపై కూడా దుర్భాషలాడిన పరిస్థితిని చూశాం. పార్లమెంటు సభ్యుడిని బంధించి కొట్టించిన తీరు చూశాం. సుదీర్ఘ అనుభవం, సీఎంగా పనిచేసిన చంద్రబాబును కూడా జైలుల్లో పెట్టారు. అడ్డగోలుగా ఇసుక దోపిడీ, భూ కుంభకోణాలు చేశారు. అందుకే ఐదు కోట మంది ఒక్కటై అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. నేను ప్రధాని మోదీ గుండెల్లో ఉన్నా. ఆయన పక్కన నిల్చొని ఫోటో దిగాల్సిన అవసరం లేదు. అధికారం కోసం కాదు, ప్రజల కోసం పోరాటం చేశాం అన్నారు.
జనసేన తీసుకున్న మంత్రి పదవులు కూడా ప్రజలతో నిత్యం సంబంధం ఉన్నవి. మన పార్టీ ఎంపీలు ప్రజా సమస్యలపై పార్లమెంటులో మాట్లాడాలి. అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఎంత సాధించిన తగ్గి ఉండటం అవసరం. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కూడా ఇలాంటి మెజార్టీ రాలేదని స్పీకర్ అయ్యన్నపాత్రుడు నాతో అన్నారు. వైసీపీ వాళ్లు మనకు ప్రత్యర్థులు మాత్రమే, శత్రువులు కాదు. చేతగాక కాదు, కక్ష సాధింపు చర్యలు ఎవరికీ మంచిది కాదు. వైసీపీ చేసిన తపులు మనం చేయకూడదు. అలాగని వాళ్లు చేసిన తప్పులు సహించేదిలేదు, చట్టపరంగా చర్యలు ఉంటాయి అని అన్నారు.













