ఎన్టీఆర్ పార్టీ పెట్టిన పరిస్థితి ఇప్పుడు లేదు: పవన్ కల్యాణ్
జనసేన పార్టీ మండల స్థాయి అధ్యక్షుల సమావేశంలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఓట్లు వేస్తేనే కదా సీఎం అయ్యేది అన్నారు. అలాగే ఎన్టీఆర్ పార్టీ పెట్టిన సమయంలో ఇన్ని పార్టీలు లేవని, అప్పటి పరిస్థితులు వేరని, అప్పుడున్న వ్యక్తులు కూడా వేరని పవన్ కల్యాణ్ చెప్పారు. ఉపేంద్ర, నాదెండ్ల భాస్కరరావు, ఎన్జీ రంగా వంటి నాయకులు ఎన్టీఆర్కు చాలా దిశానిర్దేశం చేసేవారని గుర్తుచేశారు. అప్పుడు ప్రధాన పార్టీ అంటే కాంగ్రెస్ ఒక్కటే ఉందని చెప్పారు.
డబ్బు, పగ, ప్రతీకారాలు అప్పట్లో ఇంతగా లేవన్నారు. ఇప్పుటి పరిస్థితులు అప్పటికి చాలా భిన్నంగా ఉన్నాయని, ఒక్కో అడుగు వేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళుతున్నానని వివరించారు. పాపులారిటీ ఒక్కటి ఉంటే ఇప్పుడు సీఎం అవలేరని, పాపులారిటీతో రాత్రికి రాత్రి సీఎం అవడం ఇప్పుడు ఒక కలే అని, అది ఎన్టీఆర్కు సాధ్యమైంది కానీ, అలాంటిది తాను కలలో కూడా ఊహించలేనని పవన్ చెప్పారు. ఏపీ బాగుంటేనే పవన్ బాగుంటాడని చెప్పిన ఆయన.. అంతే తప్ప రాష్ట్రం బాగాలేకపోతే మనం ఎలా బాగుంటాం అని అడిగారు. తానేమీ అజాత శత్రువును కానని, రాష్ట్రం బాగు కోసం కొందరికి శత్రువుగా మారేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. తనను ఎన్ని మాటలు అంటే అంత రాటుదేలతాను అని తెలిపారు.
‘నడవడం కూడా రాని నా పిల్లలను తిట్టారు. నన్ను కూడా నిందించారు. పోగొట్టుకోవడానికి నా దగ్గర ఏమీలేదు. అవమానాలు, ఓటములు, తిట్లు అన్నీ ఎదుర్కొని నిలబడ్డాను. పరిస్థితిని బట్టి తగ్గడం, అవసరం అయితే తిరగబడడం రెండూ నాకు తెలుసు. విజయవాడ నుంచి ఉత్తరాంధ్ర వరకు జనసేనకు 25 శాతం ఓటు బ్యాంకు ఉంది. సగటున జనసేన ఓటింగ్ 18 శాతం. అదే గోదావరి జిల్లాల్లో 36 శాతం ఉంది. భీమవరంలో ఏకంగా 18 వేల దొంగ ఓట్లు వేశారు. ఈసారి అలాంటివి జరగకుండా చూసుకుందాం’ అని పార్టీ శ్రేణులకు పవన్ సూచించారు.













