Pawan Kalyan: వైసీపీ ఓటమి, ఈవీఎంలపై పవన్ హాట్ కామెంట్స్

జనసేన (Janasena) పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చెన్నైలో వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై (One Nation One Election) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై తమిళనాడు సీఎం స్టాలిన్ (CM Stalin) పునరాలోచన చేయాలని కోరారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కు మద్దతు ఇవ్వాలని సీఎం స్టాలిన్‌ను కోరారు. “2019లో వైఎస్ఆర్‌సీపీ (YSRCP) గెలిచినప్పుడు ఉన్నవి అదే ఈవీఎంలు (EVM). అదే ఈవీఎంలతో కాంగ్రెస్ (Congress) దేశవ్యాప్తంగా ఓడిపోయింది. గత ఎన్నికల్లో బీజేపీకి (BJP) సీట్లు తగ్గాయి. వైఎస్ఆర్‌సీపీ కూడా గత ఎన్నికల్లో ఓడిపోయింది. రాజకీయ పార్టీలు తమకు నచ్చితే ఈవీఎంలు బాగున్నాయని, లేదంటే సమస్యాత్మకమని విమర్శించడం అలవాటుగా మారింది” అని ఆయన విమర్శించారు. ఈవీఎంలపై రాజకీయ నాయకుల వైఖరిని ప్రశ్నిస్తూ, దేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల అభివృద్ధి పనులకు అంతరాయం లేకుండా ఉంటుందని పవన్ పేర్కొన్నారు.
“ఏడాది పొడుగునా ఎన్నికలు జరగడం వల్ల అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని అభివృద్ధి పనులను ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఆపాల్సి వచ్చింది. అమెరికా ఎన్నికల ఖర్చు కంటే మన దేశ ఎన్నికల ఖర్చు ఎక్కువగా ఉంటోంది. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ వన్ నేషన్ వన్ ఎలక్షన్‌ను ప్రతిపాదించారు” అని పవన్ వివరించారు. స్టాలిన్‌ను ఉద్దేశించి, “కరుణానిధి డ్రీమ్‌గా ఉన్న ఈ ఎన్నికల సంస్కరణను స్టాలిన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఆయన్ని అడగాలి” అని అన్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ (NDA) కూటమి ఘన విజయం సాధిస్తుందని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. “తమిళనాడు ఎన్నికల ప్రచారంలో నేను పాల్గొంటాను. ఎన్డీఏ కూటమి బలంగా ఉంది. రాష్ట్రంలో గట్టి పోటీ ఇస్తుంది” అని ఆయన చెప్పారు. అయితే డీలిమిటేషన్ సమావేశానికి స్టాలిన్ ఆహ్వానం పంపినప్పటికీ, తాను దానికి మద్దతు ఇవ్వలేనని డీఎంకేకు స్పష్టం చేసినట్లు పవన్ తెలిపారు.
తమిళనాడులో రాజకీయ అరంగేట్రం చేసిన హీరో విజయ్ (Vijay) నేతృత్వంలోని తమిళగం వెట్రి కళగం (TVK) పార్టీకి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. “టీవీకే అధ్యక్షుడు విజయ్‌కు నా శుభాకాంక్షలు. ఒక పార్టీని ఎలా నడపాలన్నది ఆ పార్టీ అధ్యక్షుడు నిర్ణయించుకోవాలి. నేను ఎవరినీ తక్కువ చేసి చూడను. విజయ్ పార్టీ పొత్తులపై ఇప్పటివరకు చర్చలు జరగలేదని అనుకుంటున్నాను” అని ఆయన అన్నారు.