ఈ మృతికి కారణం ఎవరు.. వైసీపీ నా లేక టీడీపీ నా..?
ఎన్నికల హడావిడి ప్రచారాల వరకు, ప్రత్యర్థుల మీద మాటలు విసురుకోవడం వరకు బాగానే ఉంటుంది. హద్దు దాటి ప్రజల జీవన శైలి పై దాని ప్రభావం పడినప్పుడు భరించడం చాలా బాధాకరంగా ఉంటుంది. ఈరోజు ఆంధ్రలో అటువంటి దుర్ఘటన ఒకటి చోటుచేసుకుంది. వాలంటీర్లు వైసీపీకి వత్తాసు పలుకుతున్నారు అని ప్రతిపక్ష పార్టీలు ధ్వజమెత్తారు. వృద్ధులకు ,వికలాంగులకు, వితంతువులకు ఇంటి వద్దకే అందే పింఛన్ల పై దీని ప్రభావం పడింది. ప్రభుత్వం పింఛను ఇంటికి పంపిస్తుందా అనుకుంటే ఆఫీస్ కి వచ్చి తీసుకోమంది. మండే ఎండల్లో.. అంతంత మాత్రంగా ఉన్న ముసలిప్రాణాలు అల్లాడిపోతున్నాయి. ఈరోజు కృష్ణ జిల్లా గంగూలురులో పింఛన్ కోసం వెళ్ళిన వజ్రమ్మ అనే వృద్ధురాలు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. ఈమె మృతిపై కూడా రాజకీయం చేయడానికి పార్టీలు ఏమాత్రం వెనకాడడం లేదు. అయితే ఇక్కడ అందరూ మర్చిపోతున్న అసలు విషయం.. దీనికి కారణం ఎవరు? ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం కాదా.. ఇక్కడ ప్రభుత్వం అంటే ఒక పార్టీ కాదు.. పూర్తి వ్యవస్థ. మరి పార్టీలు అన్నీ ఆ వ్యవస్థలో భాగాలు కావా. స్వలాభం కోసం ఈ రకంగా ప్రజల జీవితాలతో ఆటలాడుకోవడం ఎంతవరకు సబబు అన్న విషయాన్ని ప్రశ్నించడం పక్కన పెట్టి.. ఇక్కడ కూడా తమ లబ్ది ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఆలోచించడం నేటి రాజకీయ వ్యవస్థ పై ఈ సంఘటన ఒక మచ్చగా మిగిలే అవకాశం ఉంది.













