Jagan: ప్రతినిధి బృందాల ఎంపిక లో వైసీపీకి నో ప్లేస్.. అసలు కారణం ఏమిటో?

దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) మధ్య ఉన్న సాన్నిహిత్యంపై గతంలో ఎన్నో చర్చలు జరిగాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కూడా ఒక సందర్భంలో “జగన్ మోడీకి దత్తపుత్రుడు” అని వ్యాఖ్యానించిన విషయం ఇప్పటికీ ప్రజల మదిలో ఉంది. గత ఐదేళ్లుగా జగన్ కేంద్రంతో, ముఖ్యంగా మోడీతో గాఢ సంబంధాలు కొనసాగించారు. మద్దతుగా రాజ్యసభ సీట్లు ఇచ్చారు. అలాగే ఆయన అడిగిన అప్పులకు మోడీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
అయితే ఇప్పుడు చోటు చేసుకుంటున్నా కొన్ని సందర్భాలను బట్టి జగన్, మోడీ మధ్య విభేదాలు తలెత్తాయా అన్న అనుమానాలకు మరింత బలం చేకూరుతుంది . ఇటీవల జమ్మూ కాశ్మీర్ (Jammu & Kashmir) లోని పహల్గాం (Pahalgam) లో జరిగిన ఉగ్రవాద దాడి తరువాత, భారత్ “ఆపరేషన్ సిందూర్” (Operation Sindoor) చేపట్టింది. ఈ చర్యకు ప్రపంచ దేశాల నుంచి మద్దతు లభించింది. ఉగ్రవాదంపై భారత్ తీసుకుంటున్న దృఢ వైఖరిని ఇతర దేశాలకు వివరించేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా వివిధ పార్టీల ఎంపీలతో కూడిన ప్రతినిధి బృందాలను ఇతర దేశాలకు పంపేందుకు సిద్ధమైంది.
ఈ ప్రతినిధుల ఎంపికలో రాజకీయంగా బీజేపీకి (BJP) వ్యతిరేకంగా ఉన్న పార్టీలు కూడా చోటు దక్కించుకున్నాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ (TMC), తమిళనాడు అధికార పార్టీ డీఎంకే (DMK)కి చెందిన ఎంపీలు ఈ బృందాల్లో ఉండగా, వైసీపీ (YSRCP)కి చెందిన ఒకరినైనా ఎంపిక చేయకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభలో నలుగురు, రాజ్యసభలో ఎనిమిది మంది సభ్యులు ఉన్నా కూడా వారిలో ఎవరికీ అవకాశం ఇవ్వకపోవడం, ప్రధానమంత్రి కార్యాలయం వైసీపీని పక్కన పెట్టిందన్న భావనకు బలం చేకూర్చింది. ఇది జగన్‌కు కేంద్రం నుంచి దూరం ఏర్పడిన సంకేతంగా పేర్కొంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోవైపు టీడీపీ (TDP)కి చెందిన ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయులు (Lavu Sri Krishnadevarayalu), అమలాపురం ఎంపీ హరీష్ గంటి (Harish Ganti)లకు ఈ బృందాల్లో స్థానం లభించడం గమనార్హం. ఒకరకంగా చెప్పాలంటే పవన్ (Pawan) మోడీకి దగ్గరైన తర్వాత నుంచి జగన్ మోడీకి దూరమయ్యాడు అన్న వాదన బలంగా వినిపిస్తోంది. మొత్తానికి ఇటు ఏపీలో 11 సీట్లకు పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసిపికి అటు కేంద్రం నుంచి కూడా పెద్దగా గుర్తింపు లేదు అన్న చర్చ జోరుగా సాగుతోంది.