కుప్పంలో లక్ష మెజార్టీ… అదే అందరి లక్ష్యం : చంద్రబాబు
దేశం గర్వించేలా కుప్పం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా మహిళలతో నిర్వహించిన ముఖాముఖిలో చంద్రబాబు మాట్లాడారు. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే మహిళల ఆదాయం రెట్టింపు చేసి చూపిస్తానని తెలిపారు. డబ్బుకు కుక్కర్తి పడి విదేశాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముకునే పరిస్థితికి వచ్చారని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉందా? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో అక్రమార్కులు రావడానికే భయపడ్డారని తెలిపారు. చీకటి వ్యాపారాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. దేశంలో ఆడబిడ్డల గురించి మాట్లాడిన తొలి పార్టీ టీడీపీ. వారికి ఆస్తిలో సమాన హక్కు కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్. తల్లిదండ్రులు ఆస్తి ఇవ్వకపోతే పోరాడి కోర్టుకు వెళ్లి తెచ్చుకునే హక్కు కల్పించారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చారు అని తెలిపారు.
డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళల్లో చైతన్యం తీసుకొచ్చాం. 2 కోట్ల మంది ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. మహిళల ఆదాయం రెట్టింపు చేసి చూపిస్తా. జగన్ మాదిరిగా రూ.10 ఇచ్చి, రూ.100 లాగడం కాదు. సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచుతాం. అవసరమైతే ఆడబిడ్డల కోసం ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తాం అని తెలిపారు. కుప్పంలో లక్ష మెజార్టీ సాధించేందుకు టీడీపీ కార్యకర్తలు కృషి చేయాలని, అదే మందరి లక్ష్యం అని పిలుపునిచ్చారు. 75 శాతం ఓట్లు పడేలా పనిచేయాలని తెలిపారు. వైసీపీకి ఓటు వేయాలని అడిగిన వారికి కర్రు కాల్చి వాత పెట్టాలని వ్యాఖ్యానించారు.













