Kotamreddy: ఏపీ పాలిటిక్స్ స్టైల్.. సాధారణ కార్యక్రమాలు కూడా వివాదాలే!

రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు సోషల్ మీడియాలో నాయకులపై సెటైర్లు పడటం రోజూ జరిగే అంశంగా మారింది. గతంలో ఇవి ఎక్కువగా దూషణల రూపంలో ఉండేవి. కానీ ప్రస్తుతం ట్రోల్స్ తక్కువగా ఉన్నా, నేతల చర్యలపై విమర్శలు మాత్రం తగ్గడం లేదు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు దీనికి ఉదాహరణలుగా నిలిచాయి.
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల కృష్ణా జిల్లాలోని పెనమలూరు (Penamaluru) ప్రాంతంలో ఒక సెలూన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇది పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమమని ఆయన బృందం ప్రకటించినా, అక్కడ ఎస్పీ స్థాయి అధికారి పాల్గొనడం, దిగువ స్థాయి అధికారుల ఏర్పాట్లు చేయడం వల్ల చర్చకు దారి తీసింది. డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి సెలూన్ ప్రారంభించడాన్ని నెటిజన్లు వ్యంగ్యంగా చూశారు. దీనిపై అధికార పార్టీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు.
ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ షార్ట్ వేసుకొని హాజరుకావడంపై కూడా సోషల్ మీడియాలో చర్చ జరిగింది. సాధారణంగా ఆయన లాల్చీ, ఫైజామాలో కనిపించే వారు. కానీ, ఈసారి షార్ట్‌లో రావడం కొంతమంది నెటిజన్లకు అజ్ఞాతం కలిగించింది. దీనిపై వచ్చిన ట్రోల్స్‌ను పవన్ పెద్దగా పట్టించుకోకపోయినా, సెటైర్లు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా ఇటీవల నెల్లూరు రూరల్ (Nellore Rural) ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) కూడా నెటిజన్ల విమర్శల పాలయ్యారు. ఆయన నెల్లూరులో ఒక నైట్‌డ్రెస్ దుకాణాన్ని ప్రారంభించడం వివాదాస్పదమైంది. ఒక మహిళ నెలకొల్పిన ఈ దుకాణానికి కోటంరెడ్డి హాజరై ఫోటోలు తీసుకోవడం సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు దారితీసింది. వైసీపీ శ్రేణులు కూడా దీనిపై విమర్శలు చేశారు.
ఈ విమర్శలపై స్పందించిన కోటంరెడ్డి, ఆ మహిళ ఒక నిరుపేద సోదరి అని, ఆమె జీవినోపాధి కోసం ఈ షాప్ ప్రారంభించిందని అన్నారు. వారి ఆహ్వానంతో అక్కడికి వెళ్లిన విషయాన్ని స్పష్టం చేశారు. ఒక ప్రజాప్రతినిధిగా తన బాధ్యతగా హాజరయ్యానని, దీన్ని అపహాస్యం చేయడం సరికాదని చెప్పారు. అయినా నెటిజన్లు మాత్రం ఆపడం లేదు. ఈ ఘటనలు చూస్తే, నాయకుల ప్రతి చిన్న పనిపై కూడా ప్రజలు స్పందిస్తున్న తీరును గమనించవచ్చు.