కడపలో విమానాల నైట్ ల్యాండింగ్‌కు ఓకె…
కడప విమానాశ్రయం లో విమానాల నైట్ ల్యాండింగ్ కు లైన్ క్లియర్ అయింది. గత కొంత కాలంగా ఈ ప్రతిపాదనపై ఉన్న అడ్డంకులు తొలగిపోవడంతో రాత్రివేళల్లో విమానాల రాకకు మార్గం సుగమం అయింది. ముఖ్యంగా దీనిపై అటవీ శాఖ వ్యక్తం చేస్తూ వచ్చిన అభ్యంతరాలు తొలగిపోవడంతో లైట్లు ఏర్పాటుకు అటవీ శాఖ అనుమతి సైతం లభించింది. ఢిల్లీలో శనివారం జరిగిన నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డ్ మీటింగ్ లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
కడపలో రాత్రి వేళ విమానాలు దిగేలా చర్యలు తీసుకోవాలని పలు మార్లు ఢిల్లీలో అటవీశాఖ అధికారులను కలిసి ఎయిర్ పోర్ట్ అడ్వైజరి కమిటి చైర్మన్, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి….విన్నవించిన నేపధ్యంలో ఈ మేరకు నిర్ణయం జరిగింది. విమానాల ల్యాండింగ్ కోసం నాలుగు అబ్ స్టాకిల్ లైట్ల ఏర్పాటుకు అనుమతి లభించింది. ఇందులో రెండు ప్రాంతాలు కడప ఫారెస్ట్ డివిజన్ లోని లంకమల్ల అభయారణ్యం కాగా… మరో రెండు ప్రొద్దుటూరు సబ్ ఫారెస్ట్ డివిజన్ లోని నాగార్జున సాగర్- శ్రీశైలం పులుల సంరక్షణ ప్రాంతం… ఈ ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు అనుమతి ఇస్తూ వైల్డ్ లైఫ్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది.













