వైఎస్ కుటుంబ కురుక్షేత్రంగా మారుతున్న ఏపీ రాజకీయం..
ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనేది మన తెలుగు సామెతల్లో ఒకటి. పాపం జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఈ సామెతకు చాలా దగ్గరగా లింక్ అయ్యేలా కనిపిస్తుంది. ఒకపక్క ప్రతిపక్ష పార్టీలు మాట్లాడే దానికి సమాధానం చెప్పాలా లేక ఇంట్లో సొంత చెల్లెలు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాలా అర్థం కాని స్థితిలో జగన్మోహన్ రెడ్డి సతమతమవుతున్నారు. ఇటీవల వివేకా హత్య కేసుపై సాక్షి ఛానల్ లో అయినా చర్చకు సిద్ధమంటూ సునీత సవాల్ విసిరారు. బాబాయిని హత్య చేసిన వారికి టికెట్ ఎలా ఇస్తారు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాగైనా ఈసారి జగన్ ప్రభుత్వం ఆంధ్రాలో రాకూడదు అని ఆమె అన్న మాటలు సెన్సేషన్ సృష్టించాయి .తన తండ్రి హత్యను వాడుకొని లబ్ది పొందారు అంటూ జగన్ పై ఆమె ఆరోపణ చేశారు. అన్నగా కాకపోయినా కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిన తన సమస్యపై స్పందించి సమాధానం చెప్పాలని ఆమె జగన్ ను డిమాండ్ చేశారు. మరోపక్క షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున అన్నకు వ్యతిరేకంగా విమర్శల వాయనాలు వడ్డిస్తోంది. దీంతో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు కుటుంబ కథనరంగంగా మారుతున్నాయి.













