Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ ఇప్పట్లో బయటకు రావడం కష్టమేనా..?
ఆంధ్రప్రదేశ్ (AP)లో వివాదాస్పద వ్యక్తిగా పేరొందారు వల్లభనేని వంశీ మోహన్ (Vallabhaneni Vamsi Mohan). ప్రస్తుతం అనేక కేసుల్లో ఇరుక్కుని విజయవాడ జిల్లా జైలులో (Vijayawada Jail) రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గన్నవరం (Gannavaram) మాజీ ఎమ్మెల్యేగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నేతగా గుర్తింపు పొందిన వంశీపై ఇప్పటివరకూ దాదాపు 16 కేసులు ఉన్నట్టు సమాచారం. ఈ కేసుల్లో కొన్ని 2019లో ఆయన తెలుగుదేశం పార్టీ (TDP)లో ఉన్నప్పుడు నమోదయ్యాయి. మరికొన్ని YSRCPలో చేరిన తర్వాత నమోదయ్యాయి. 2024లో TDP నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరికొన్ని కేసులు వంశీపై రికార్డయ్యాయి.
ముఖ్యంగా ఫిబ్రవరి 20, 2023న గన్నవరంలోని TDP కార్యాలయంపై జరిగిన దాడిలో వంశీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయన A71 నిందితుడిగా ఉన్నారు. నారా లోకేష్ (Lokesh), చంద్రబాబుపై (Chandrababu) విమర్శలు, ఆ తర్వాత TDP నేత కొమ్మారెడ్డి పట్టాభిరాంతో జరిగిన వాగ్వాదం ఈ దాడికి దారితీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో 88 మందిపై చర్యలు తీసుకున్నారు. TDP కార్యాలయంపై దాడి కేసులో సాక్షిగా ఉన్న ముదునూరి సత్యవర్ధన్ (Mudunuri Satyavardhan) ను వంశీ కిడ్నాప్ చేసి, బెదిరించి, తప్పుడు అఫిడవిట్ ఇప్పించారనే ఆరోపణలపై మరో కేసు నమోదైంది. ఈ ఆరోపణలతో ఫిబ్రవరి 13, 2025న హైదరాబాద్‌లోని వంశీ నివాసంలో ఆయన అరెస్టయ్యారు. జాస్తి మురళీ కృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు వంశీపై భూకబ్జా ఆరోపణలతో మరో కేసు నమోదైంది. ఈ కేసులో కూడా ఆయన రిమాండ్‌లో ఉన్నారు. TDP ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, బాపులపాడు తహసీల్దార్ నరసింహరావు ఫిర్యాదుతో వంశీపై నకిలీ భూ పట్టాలు రూపొందించి పంచినట్లు కేసు నమోదైంది. ఈ కేసు కూడా తాజాగా తెరపైకి వచ్చింది.
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఫిబ్రవరి 13, 2025న అరెస్టైన వంశీకి మొదట 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 25, మార్చి 11, మార్చి 25, ఏప్రిల్ 8 వరకు రిమాండ్ పొడిగించారు. పోలీసులు మూడు రోజుల కస్టడీ కోరగా, వంశీ సహకరించకపోవడంతో మరింత కస్టడీ కోసం పిటిషన్ దాఖలు చేశారు. TDP కార్యాలయంపై దాడి కేసులో CID కోర్టు రిమాండ్‌ను ఏప్రిల్ 9, 2025 వరకు పొడిగించింది. మార్చి 20న మూడు రోజుల CID కస్టడీకి కోర్టు అనుమతించింది. భూకబ్జా కేసులో రిమాండ్ ఏప్రిల్ 1 వరకు విధించబడింది. తాజాగా మార్చి 28న ఉంగుటూరు పీఎస్‌లో శ్రీధర్ రెడ్డి ఫిర్యాదుతో కొత్త కేసు నమోదైంది. గన్నవరం కోర్టు ఒక రోజు పోలీసు కస్టడీకి అనుమతించింది.
వంశీ బెయిల్ కోసం ఆయన లీగల్ టీమ్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆరోగ్య కారణాలు, రాజకీయ కక్షసాధింపు ఆరోపణలతో బెయిల్ పిటిషన్లు వేసింది. అయితే వాటిని కోర్టులు తిరస్కరించాయి. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మార్చి 27న, TDP ఆఫీసుపై దాడి కేసులో మార్చి 28న బెయిల్ పిటిషన్లను కోర్టులు తిరస్కరించాయి. వంశీ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు ఆయన తరపు న్యాయవాదులు చెబుతున్నారు. జైలులో ప్రత్యేక సౌకర్యాలు, ఇంటి ఆహారం అనుమతింతాలని కోరారు. అయితే వీటిని కూడా కోర్టులు తిరస్కరించాయి.
వంశీ రాజకీయ ప్రయాణం TDP నుంచి YCPకి మారిన తర్వాత వివాదాలతో నిండిపోయింది. ప్రస్తుతం ఆయనపై నమోదైన కేసులు కిడ్నాప్, SC/ST చట్ట ఉల్లంఘన, భూకబ్జా, దాడికి సంబంధించినవై ఉన్నాయి. వీటిలో కొన్ని తీవ్ర నేరరోపణకు సంబంధించినవి కావడంతో ఆయనకు బెయిల్ లభించే అవకాశాలు కనిపించట్లేదు.













