సూరీడి ఉగ్రరూపం…28 వరకూ ఇంతే…
మండే ఎండలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. మరో ఐదు రోజులూ ఈ భగభగలు కొనసాగనున్నాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని, కర్నూలు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురువారం గుంటూరు జిల్లా భట్టిప్రోలు, కృష్ణా జిల్లా పమిడిముక్కలలో గరిష్ఠంగా 47.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తు నిర్వహణ శాఖ పేర్కొంది. అలాగే ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 10 మండలాల్లో గురువారం 47 నుంచి 47.8 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో 75 మండలాల్లో వడగాలులు, 140 మండలాల్లో అధిక వేడి, 437 మండలాల్లో వేడి వాతావరణం నెలకొంది.
28 వరకు ఎండలు.. తర్వాత వానలు
రాష్ట్రంలో వడగాలుల తీవ్రత పెరుగుతుందని, శుక్రవారం నుంచి రాయలసీమలోనూ ప్రభావం అధికంగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. ఈ నెల 28 వరకు వడగాలులు వీస్తాయని తెలిపారు. 29 నుంచి పిడుగులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. నైరుతి రుతుపవనాలు జూన్ 5 నాటికి కేరళను తాకి, కొన్నిరోజులకు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందన్నారు. వడగాలుల తీవ్రత పెరుగుతున్నందున జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వాతావరణ సూచనల ప్రకారం రేపటి నుంచి 25 వ తేదీ వరకు నాలుగు రోజులపాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. వివరాలిలా ఉన్నాయి. 22 న శ్రీకాకుళం , విజయనగరం , విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 45° నుంచి, 47°సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. పశ్చిమగోదావరి, కృష్ణ , గుంటూరు , ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 43°-44° డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 41°-42° డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక 23 న విశాఖపట్నం, క్రిష్ణా, గుంటూరు , ప్రకాశం, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 46°-48° వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విజయనగరం ,తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43°-45° డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
శ్రీకాకుళం, కడప, అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40°-42°వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక 24 న విజయనగరం , విశాఖపట్నం, క్రిష్ణా , గుంటూరు , ప్రకాశం, నెల్లూరు, జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 44°-46° వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°43° వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 39°-42°వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక 25 న ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 43°-44°ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, క్రిష్ణా, గుంటూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 41°-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
శ్రీకాకుళం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 38°-39°ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విపత్తుల నిర్వహణశాఖ జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ప్రజలు కుడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచించారు. వడగాలుల బారిన పడకుండా మహిళలు, పిల్లలు, వృద్దులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ఓఆర్ఎస్(ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని సూచించారు. మంచినీరు ఎక్కువగా తీసుకుంటుండాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ సూచించారు.













