స్మార్ట్ నగరంగా గుంటూరు.. ఆధునిక హంగులతో సిక్స్ కారిడార్ ప్రాజెక్టు!
Guntur: గుంటూరు నగర రూపురేఖలను సమూలంగా మార్చేందుకు నగరపాలక సంస్థ భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. రాజధాని ప్రాంతంలో కీలకమైన నగరంగా ఉన్న గుంటూరును మరింత సుందరంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు ఆరు ప్రధాన మార్గాలను ‘మోడల్ కారిడార్లు’గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. సుమారు రూ. 210 కోట్ల అంచనా వ్యయంతో 39.3 కిలోమీటర్ల మేర ఈ రహదారులను ఆధునిక హంగులతో తీర్చిదిద్దనున్నారు.
అభివృద్ధి చేయనున్న ఆరు కారిడార్లు..
- చుట్టుగుంట సెంటర్ – గోరంట్ల రోడ్డు: 8 కి.మీ పొడవునా అమరావతి రోడ్డు వరకు విస్తరణ.
- మద్రాసు గుంటూరు రోడ్డు: దండిమార్చి విగ్రహం నుండి అంకిరెడ్డిపాలెం వరకు 8 కి.మీ మేర అభివృద్ధి.
- ఇన్నర్ రింగ్ రోడ్డు: మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డు నుండి జాతీయ రహదారి అనుసంధానం వరకు 12 కి.మీ.
- పొన్నూరు రోడ్డు: బీఆర్ స్టేడియం నుండి బైపాస్ వరకు 4.5 కి.మీ.
- గుంటూరు – హనుమాన్ పాలెం రోడ్డు: చాకలి చెరువు నుండి బైపాస్ వరకు 3.8 కి.మీ.
- గుంటూరు వీఐపీ రోడ్డు: వెస్ట్ పోలీస్ స్టేషన్ నుండి బైపాస్ వరకు 3 కి.మీ మేర ఆధునికీకరణ.
ప్రత్యేకంగా వెండింగ్ జోన్లు..
ఈ ప్రాజెక్టులో భాగంగా కేవలం రోడ్ల విస్తరణే కాకుండా.. పాదచారుల కోసం ప్రత్యేక నడక మార్గాలు, సైకిల్ ట్రాకులు, కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు స్మార్ట్ బస్ స్టాప్‌లు, ఆధునిక మరుగుదొడ్లు, డివైడర్ల మధ్య పచ్చదనం, వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు ఆధునిక బోలార్డ్స్ను ఏర్పాటు చేస్తారు. చిరువ్యాపారుల కోసం ప్రత్యేకంగా వెండింగ్ జోన్లను కూడా క్రమబద్ధీకరించనున్నారు. ఈ కారిడార్ల ద్వారా ట్రాఫిక్ సమస్యలు తగ్గడమే కాకుండా, నగర జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని కమిషనర్ మయూర్ అశోక్ ఆశాభావం వ్యక్తం చేశారు.








