అలా చేస్తే వైసీపీ పెద్ద తప్పు చేసినట్లే .. గంటా శ్రీనివాసరావు
తన రాజీనామాను స్పీకర్ ఆమోదించారంటూ గత రాత్రి నుంచి జరుగుతున్న ప్రచారం పూర్తిగా వైసీపీ మైండ్ గేమ్ మాత్రమేనని తెలుగుదేశం పార్టీ ఎమ్యెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజీనామా విషయంపై తనకు ఎలాంటి అధికారిక సమాచారం లేదన్నారు. తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికే తన రాజీనామాను ఆమోదించారనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీలో ఓ ఎమ్మెల్యే ఓటు వేయలేకపోతున్నారనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ఇలా చేస్తే వైసీపీ అసంతృప్తులు వెనక్కు తగ్గుతారనేది ఆ పార్టీ ఆలోచన అని అన్నారు. రెండేళ్ల క్రితం రాజీనామా చేసి స్పీకర్ను వ్యక్తిగతంగా రెండుసార్లు కలిశా. నాటి నుంచి ఆమోదించకుండా ఉండిపోయిన రాజీనామాను గంటలో ఓటింగ్ అనగా ఆమోదిస్తారా? ఓటర్ లిస్టు వచ్చాక రాజీనామా ఆమోదించడం అనేది సాంకేతికంగా కుదరదు. అలా చేస్తే వైసీపీ పెద్ద తప్పు చేసినట్లే అవుతుంది. పంచుమర్తి అనురాధ నామినేషన్ పత్రాలపై ప్రపోజల్ సంతకం చేసింది నేనే. మా అభ్యర్థి అనురాధ గెలవబోతున్నారు అని అన్నారు.













