జగనన్న వచ్చాక ఈ లెక్క మారిపోయింది : గంటా
టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో దసరా, దీపావళి, రంజాన్ లాంటి ముఖ్యమైన పండుగలకు వారం ముందే ఉద్యోగులు జీతాలందుకునేవారని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. అలాంటి పరిస్థితి నుంచి జగనన్నా పండగొస్తోంది. మన జీతాలన్నా మమ్మల్ని కరుణించన్నా అనేలా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయని విమర్శించారు. అమ్మో ఒకటో తారీఖు అనేది పాత మాట అని, ఇప్పుడు ఆ తేదీనే మర్చిపోయిన రోజులు వచ్చాయన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒకటో తేదీన జీతాలు పడిన సంఘటనలు అరుదుగా ఉన్నాయన్నారు.
గతంలో ఉద్యోగులు, పెన్షనర్లకు ఒకటో తేదీ ఉదయాన్నే జీతం పడినట్లు మెసేజ్ వచ్చేది. జగనన్న వచ్చాక ఈ లెక్క మారిపోయింది. జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏ తేదీన వస్తుందో తెలియదు. అంతా అయోమయం జగన్మాయగా మారిపోయింది. నెల నెలా ఈఎంఐలు ఎలా చెల్లించాలో తెలియక ఉద్యోగులు లబోదిబో మంటున్నారు. 2019లో రాష్ట్రానికి జరగకూడని నష్టమే జరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల పరిస్థితి మింగలేక కక్కలేక అనేలా తయారైంది. రాష్ట్రంలోని విద్యావంతులు ఆలోచించాలి. విజన్‌కు ఉన్న విలువ విధ్వంసం తెచ్చే వినాశనం ఏంటో ఇప్పటికే అర్థమై ఉంటుంది. 2024లో ఏపీ భవిష్యత్‌కు మీరు దిక్సూచిలా ముందుండాలి. రాష్ట్రాన్ని రక్షించుకోండి అని అన్నారు.













