Vallabhaneni Vamshi: వంశీకి మూడినట్టే.. పెద్ద కేసు లాగారు..?
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhaneni Vamshi) విషయంలో ఇప్పుడు పోలీసులు అనుసరిస్తున్న వైఖరి వైసిపిని కంగారు పెడుతోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రెచ్చిపోయిన వంశీని ఇటీవల ఓ కిడ్నాప్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత గన్నవరం పార్టీ ఆఫీస్ పై దాడి కేసులో ఆయనకు హైకోర్టు బెయిల్ రద్దు చేసింది. దీనితో వంశీ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి. తాజాగా ఆయనకు మార్చి 11వ తేదీ వరకు రిమాండ్ విధించారు. ఇక నియోజకవర్గంలో ఆయన చేసిన అక్రమాలు, కబ్జాలు, దందాలకు సంబంధించి పోలీసులు అలాగే రెవిన్యూ అధికారులు లెక్కలు బయటకు తీయడం మొదలుపెట్టారు.
తాజాగా గన్నవరం నియోజకవర్గంలో గాంధీ బొమ్మ సెంటర్లో… ఆయన 10 కోట్ల విలువ చేసే స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశారని ఆయనపై కేసు నమోదు అయింది. ఓ మహిళ ఫిర్యాదుతో గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే హనుమాన్ జంక్షన్ సమీపంలోని కొన్ని గ్రామాల్లో ఆయన అక్రమంగా గ్రావెల్ తోలుకున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 2019 నుంచి 2024 వరకు వంశీ ప్రభుత్వానికి 200 కోట్ల మేర నష్టం చేకూర్చారని లెక్కలు బయటకు తీశారు. దీనితో ఆయన పై విచారణకు ప్రత్యేకదర్యాప్తు బృందాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
దీనితో వల్లభనేని వంశీ ఖచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అటు వైసీపీ(YSRCP) అధిష్టానం కూడా వంశీని బయటకు తీసుకువచ్చేందుకు నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. అయినా సరే సాధ్యమయ్యే అవకాశాలు కనబడటం లేదు. ఆయనపై ఇప్పటికే పీటీ వారంట్ కూడా దాఖలు చేశారు. త్వరలోనే మరికొన్ని కేసుల్లో ఆయనను విచారించే అవకాశం కూడా ఉంది. ఇక మంగళవారం వల్లభనేని వంశీని దాదాపు మూడు గంటల పాటు పోలీసులు విచారించి కీలక అంశాలను రాబట్టినట్లు వార్తలు వస్తున్నాయి.













