PSR Anjaneyulu: ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్..!

ఆంధ్రప్రదేశ్ పోలీసులు (AP Police) స్పీడ్ పెంచారు. వైసీపీ హయాంలో అడ్డగోలుగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కొరడ ఝళిపిస్తున్నారు. సినీ నటి కాదంబరి జత్వాని కేసు (Kadambari Jethwani Case) ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. ఈ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును (PSR Anjaneyulu, IPS) ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ వెనుక జత్వాని కేసుతో పాటు, నరసాపురం మాజీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు (RRR)పై 2021లో థర్డ్ డిగ్రీ (Third Degree) ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాక.. సస్పెండ్ అయిన తర్వాత వైసీపీ నేతలతో కుట్రలు, డిపార్ట్ మెంట్ నుంచి సమాచార లీకులు వంటివి కూడా ఆంజనేయులు చుట్టూ చుట్టుముట్టాయి.
ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వాని, వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ (Kukkala Vidya Sagar) మధ్య భూలావాదేవీల్లో వివాదంలో మొదలైంది. జత్వాని తన ఐదు ఎకరాల భూమిని అక్రమంగా కాజేసిందని, రూ.5 లక్షలు దోచుకుందని ఆరోపిస్తూ 2024 ఫిబ్రవరిలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో (Ibrahimpatnam PS) విద్యాసాగర్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా, ఆంజనేయులు ఆదేశాలతో అప్పటి విజయవాడ పోలీసు కమిషనర్ కాంతి రానా టాటా (Kanthi Rana Tata), డీసీపీ విశాల్ గున్నీ (Vishal Gunni) ముంబై వెళ్లి జత్వాని, ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు. వీరు 42 రోజుల పాటు విజయవాడ జైలులో గడిపారు. అయితే, జత్వాని ఈ ఆరోపణలను ఖండించి, తనపై కేసు నకిలీదని, విద్యాసాగర్ తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపించారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమె కేసు పెట్టారు. ఈ కేసులో ఆంజనేయులుతో పాటు ఇద్దరు ఐపీఎస్ అధికారులు కాంతి రానా టాటా, విశాల్ గున్నీలపై సస్పెన్షన్ వేటు పడింది.
ఏపీ సీఐడీ (AP CID) పోలీసులు హైదరాబాద్‌లో ఆంజనేయులును అరెస్ట్ చేయడం రాష్ట్రంలో కలకలం రేపింది. జత్వాని కేసులో ఆయన తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఫిర్యాదు నమోదు కాకముందే, జనవరి 31, 2024న ఆంజనేయులు అరెస్ట్ ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ హడావుడిలో విశాల్ గున్నీ ఫిబ్రవరి 1న ముంబైకి విమాన టికెట్లు బుక్ చేసినట్లు తెలుస్తోంది. ఇది ప్రోటోకాల్ ఉల్లంఘనగా పరిగణించబడింది. ఈ కేసులో ఆంజనేయులు అధికార దుర్వినియోగం, తప్పుడు కేసు నమోదు, వంటి చర్యలకు పాల్పడినట్లు ప్రభుత్వం గుర్తించింది. అంతేకాక.. 2021లో, వైసీపీ రెబల్ ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణరాజును హైదరాబాద్‌లో సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి, గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించారు. అక్కడ ఆయనపై థర్డ్ డిగ్రీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆంజనేయులు, మాజీ సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిలపై కేసు నమోదైంది.
మరోవైపు.. సస్పెన్షన్ తర్వాత ఆంజనేయులు విజయవాడ దాటి వెళ్లకూడదని షరతు విధించారు. అయితే ఆయన హైదరాబాద్ లో ఉంటూ కేసుల్లో ఇరుకున్న వైసీపీ నేతలకు సలహాలు, సూచనలు ఇచ్చి కేసుల నుంచి బయటపడేందుకు సాయం చేస్తున్నారనే ఆరోపణలు వినిపించాయి. వీటిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు జెత్వానీ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు ముందస్తు బెయిల్ తీసుకోలేదు. ఇది కూడా ఆరెస్టును మార్గం సుగమం చేసింది. కాంతిరాణ తాతా, విశాల్ గున్నీ ఈ కేసులో ముందస్తు బెయిల్ పొందారు. పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు తర్వాత కాదంబరి జెత్వానీ కేసు విచారణ వేగవంతమవుతుందని భావిస్తున్నారు.