కాపు ఉద్యమ నేత , ముద్రగడ కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరియు సామాజిక ఉద్యమాల్లో తనదైన ముద్ర వేసిన మాజీ మంత్రి, కాపు సంక్షేమ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలుసుకున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో 1953 జనవరి 22న ముద్రగడ జన్మించారు. ఈయన తండ్రి వీరరాఘవరావు 1962, 67ల్లో ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా పనిచేశారు. 1977లో ఆయన హఠాన్మరణంతో ముద్రగడ రాజకీయాల్లో వచ్చారు. జనతా పార్టీలో చేరి, ప్రత్తిపాడు నుంచి 1978లో తొలిసారి ఎమ్మెల్యే (MLA)గా గెలిచారు. 1982లో తెలుగుదేశం పార్టీలో చేరి, అక్కడే 1983, 85ల్లో ఆ పార్టీ తరఫున గెలిచారు. ఎన్టీఆర్ క్యాబినెట్లో ఎక్సైజ్, రవాణా శాఖల మంత్రి (Minister)గా పనిచేశారు. అయితే మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజారక్షణ సమితి పార్టీ స్థాపించారు. తదనంతరం కేఈ కృష్ణమూర్తి, కె.జానారెడ్డి తదితరులతో కలిసి తెలుగునాడు పార్టీని స్థాపించారు. తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. 1989లో ప్రత్తిపాడు నుంచే నాలుగోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కింది. 1994లో ముద్రగడ తొలిసారి ఓడిపోయారు. అనంతరం ఆయన కాపునాడుతోను, బీజేపీతోను అనుబంధం సాగించారు. 1999 ఎన్నికల ముందు తిరిగి టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2004 లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. తర్వాత రాజకీయాలకు కొన్నాళ్లు దూరంగా ఉండి 2008లో మరోసారి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2009 వరకే ఆపార్టీలో ఉన్నారు. అనంతరం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండిపోయిన ముద్రగడ.. 2024 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు వైసీపీలో చేరారు. పిఠాపురంలో వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ముద్రగడ రాష్ట్రంలో కాపు |(Kapu) ఉద్యమ నేతగా గుర్తింపు పొందారు. కాపు రిజర్వేషన్ల కోసం పోరాడారు. 1994లో నిరాహార దీక్ష చేపట్టారు. 2005లో పోలవరం నిర్వాసితుల కోసం తన ఇంట్లో ఆమరణ దీక్ష చేపట్టారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ గెలిచాక 2016 జనవరిలో ముద్రగడ కాపు రిజర్వేషన్ల కోసం మరోసారి ఉద్యమం చేశారు. తునిలో 2016 జనవరి 31న వి.కొత్తురులోని ఓ మైదానంలో సభ ఏర్పాటుచేశారు. ఆ సమయంలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైలుకు ఆందోళనకారులు నిప్పంటించారు.








