Jagan: ఇప్పటికైనా జగన్ లో మార్పు రాకపోతే పార్టీకి కష్టమే ..
చాలా మందికి అధికారం స్థిరంగా ఉంటుందని అని అనుకుంటారు , కానీ రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. 2019లో ఘన విజయంతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ (YS Jagan) , తాను ముప్పయ్యేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటానని ధీమాగా చెప్పినప్పుడు, చాలా మంది ఆ మాట నమ్మారు. మరీ ముఖ్యంగా, ఆయన భారీ మెజారిటీ సాధించిన తర్వాత ఆ మాట వాస్తవమైపోతుందనుకున్నారు. కానీ ఐదేళ్ల తరువాత రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. 151 సీట్ల నుంచి కేవలం 11 సీట్లు మాత్రమే వస్తాయని వైసీపీ (YCP) ఊహించలేకపోయింది.
ఈ ఓటమి అనంతరం జగన్ మళ్లీ తన సత్తా చూపేందుకు ప్రయత్నిస్తారు అన్ని అంతా భావించారు. కానీ జగన్ మాత్రం అదే ధోరణిని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ముప్పయ్యేళ్ళ ముఖ్యమంత్రి అని చెప్పడం ఆయన ధీమాను సూచిస్తున్నా, రాజకీయ వాస్తవాలు మాత్రం వేరుగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఓటమి తర్వాత, పార్టీకి కొత్త దిశను సూచించే ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. కానీ, ఆత్మ పరిశీలన కన్నా, మళ్లీ అదే మాటలు వినిపిస్తున్నాయి.
తాను ముప్పయ్యేళ్ల పాటు సీఎం గా ఉంటానని చెప్పడం, వ్యూహాత్మకంగా బలహీనంగా మారుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ జగన్ 30 ఏళ్లపాటు సీఎంగా ఉండాలంటే, ఆయన వయసు దాదాపుగా 90కి చేరుకోవాలి. అదే సమయంలో, జగన్ రాజకీయ ప్రత్యర్థులు కూడా బలపడుతున్నారు. చంద్రబాబు(Chandrababu ) ఇప్పటికే అనుభవజ్ఞుడైన నాయకుడు. లోకేష్ (Lokesh) పార్టీ వారసుడిగా ఎదుగుతున్నాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా రాజకీయంగా గట్టిగా నిలదొక్కుకున్నాడు. భవిష్యత్తులో మరో కొత్త నాయకుడు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టినా, కొత్త సమీకరణాలు ఏర్పడొచ్చు.
ఇలాంటి పరిస్థితుల్లో, జగన్ ఇప్పుడు ఉన్న పరిస్థితిని అంచనా వేసుకోవాలి. ముప్పయ్యేళ్ళ కలలో కాకుండా, వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు రూపొందించుకోవాలి. 2029 ఎన్నికల కోసం కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. అంతకు ముందు 2026లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. అవి గెలవడమే వైసీపీకి కీలకం. ఈ సమయంలో పార్టీ క్యాడర్ ను గట్టి బలంగా ఉంచడం, నేతలకు భరోసా ఇవ్వడం ముఖ్యం.
వైసీపీకి మళ్లీ తిరిగి బలమైన స్థానం రావాలంటే, జగన్ 2014లో ఉన్నట్లుగా జనంలోకి వెళ్లి మమేకం కావాలి. పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలి. ప్రత్యర్థులు ఎలా ముందుకెళ్తున్నారనే విషయాన్ని అర్థం చేసుకుని, తగిన విధంగా వ్యూహాలు రచించాలి. లీడర్ ఒకే విధంగా ఉండిపోయి, నేల విడిచి సాము చేస్తే రాజకీయంగా ఎదుర్కొనే ప్రతికూలతలు పెరుగుతాయి. కాబట్టి, జగన్ ముందుగా వచ్చే ఎన్నికల్లో గెలవడం లక్ష్యంగా పెట్టుకుని, పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.













