Donald Trump: అమెరికాలో కొత్త వీసా విధానం: పెట్టుబడిదారులకు గోల్డెన్ అవకాశం..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump) వీసా (American Visa) విధానంలో మార్పులు చేయడానికి ముందుకు వచ్చారు. అమెరికా ఫస్ట్ అనే తన విధానాన్ని కొనసాగిస్తూ, వలస విధానాన్ని కొత్త దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న వీసా విధానానికి భిన్నంగా, అమెరికా పౌరసత్వాన్ని పొందే ప్రక్రియను సులభతరం చేసేలా కొత్త గోల్డెన్ కార్డ్ వీసాను (Golden card Visa) ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.
ఈ కొత్త విధానం ప్రకారం, అమెరికాలో పెట్టుబడి పెట్టే వ్యక్తులకు ప్రత్యేక గోల్డెన్ వీసా మంజూరు చేయనున్నారు. ఈ వీసాను పొందేందుకు వ్యక్తులు కనీసం 5 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు 44 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాలి. ఈ విధానం వల్ల అమెరికాలో ధనవంతుల సంఖ్య పెరిగి, ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని భావిస్తున్నారు. అలాగే, ఈ పెట్టుబడిదారులు దేశానికి పన్నులు చెల్లించడమే కాకుండా, కొత్త ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ ఓవల్ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ, ఈ కొత్త విధానం గురించి వివరించారు. వాణిజ్య మంత్రి హోవర్డ్ లట్నిక్ కూడా దీనిపై స్పందిస్తూ, ఈబీ5 వీసాను పూర్తిగా తొలగించి, గోల్డెన్ కార్డ్ వీసాను అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇది అమెరికాలో శాశ్వత నివాసం పొందే అవకాశం కల్పిస్తుందని, పెట్టుబడిదారులకు ఇది మరింత ప్రయోజనకరంగా మారుతుందని చెప్పారు.
ఇప్పటి వరకు అమలులో ఉన్న ఈబీ5 వీసా విధానం 1990లో ప్రారంభమైంది. అయితే, దీనిపై మోసపూరిత కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఇటీవల అధ్యయనంలో తేలింది. కొందరు వ్యక్తులు అక్రమంగా నిధులు వాడుకున్న ఘటనలు బయటపడటంతో, ట్రంప్ ప్రభుత్వం ఈ విధానంలో మార్పులు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గోల్డెన్ వీసా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ వీసాను ప్రతి ఏటా పరిమిత సంఖ్యలో కాకుండా, పెద్ద ఎత్తున మంజూరు చేయాలని ట్రంప్ నిర్ణయించారు. తన ప్రభుత్వం కోటి గోల్డెన్ కార్డులను జారీ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలు ఇప్పటికే ఇలాంటి వీసాలను అందిస్తున్నాయని, అమెరికా కూడా ఇప్పుడు అదే మార్గాన్ని అనుసరిస్తోందని తెలిపారు.
ఈ కొత్త వీసా విధానం వల్ల అమెరికాకు పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తాయని, దీనివల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ట్రంప్ నమ్మకం వ్యక్తం చేశారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను మరింత ముందుకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా పెట్టుబడిదారులకు గ్రీన్ కార్డు లాంటి ప్రత్యేక హోదా లభించడంతో, అమెరికాలో స్థిరపడేందుకు వీలవుతుందని అభిప్రాయపడ్డారు.