నకిలీ ప్రొఫైల్.. నమ్మించే మాటలు.. లక్షలు పోగొట్టుకున్న టెక్కీలు!
Guntur: సైబర్ నేరగాళ్ల మాయలో సామాన్యులే కాదు, చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సైతం పడి లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు. మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో అందమైన యువతుల ఫోటోలతో నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి, పెళ్లి పేరుతో నమ్మించి నిలువునా ముంచేస్తున్న ముఠాలు గుంటూరులో పంజా విసిరాయి. కేవలం నెల రోజుల వ్యవధిలో ఇద్దరు ఐటీ ఉద్యోగులు ఈ కేటుగాళ్ల చేతిలో చిక్కి సుమారు 11 లక్షల రూపాయలు కోల్పోయారు.
సన్నిహితంగా మాట్లాడుతూ..
నేరగాళ్లు ముందుగా మ్యాట్రిమోనీ సైట్లలో పరిచయమై, ఆ తర్వాత వాట్సాప్ కాల్స్ ద్వారా బాధితులతో సన్నిహితంగా మాట్లాడుతున్నారు. తాము కూడా ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నామని, ఆస్తులు ఉన్నాయని నమ్మబలుకుతున్నారు. నమ్మకం కుదిరిన తర్వాత, “మన భవిష్యత్తు కోసం ఈ వెబ్సైట్లో ఇన్వెస్ట్ చేద్దాం.. మంచి లాభాలు వస్తాయి” అని ఆశ చూపుతున్నారు. వారి మాటలు నమ్మిన బాధితులు వారు పంపిన లింకుల్లో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు.
సొమ్ము విదేశీ ఖాతాల్లోకి వెళ్లడం..
పాతగుంటూరుకు చెందిన ఒక ఇంజనీర్ సుమారు రూ. 7 లక్షలు, అరండల్‌పేటకు చెందిన మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ రూ. 4 లక్షలు ఈ విధంగా పోగొట్టుకున్నారు. బాధితులు డబ్బులు జమ చేసిన కొద్దిరోజులకే సదరు యువతుల ఫోన్ నంబర్లు స్విచ్ఛాఫ్ అవ్వడంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. ఈ సొమ్ము విదేశీ ఖాతాల్లోకి వెళ్లడం వల్ల రికవరీ చేయడం సవాలుగా మారిందని పోలీసులు చెబుతున్నారు. అపరిచిత వ్యక్తుల పెట్టుబడి సలహాలను నమ్మి మోసపోవద్దని సైబర్ క్రైమ్ విభాగం హెచ్చరిస్తోంది.








