టీడీపీ-జనసేన కూటమిలోకి కాంగ్రెస్..?
సార్వత్రిక ఎన్నికల ముందు ఏపీ రాజకీయాలు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. నిన్నటి వరకూ ఏపీలో కాంగ్రెస్ గురించి ఆలోచించే వారే లేరు. అయితే తెలంగాణలో అధికారం రావడంతో కాంగ్రెస్ హైకమాండ్ ఏపీపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికిప్పుడు, ఇంత తక్కువ సమయంలో వైసీపీతో కాంగ్రెస్ పోరాడడం కష్టం… కాబట్టి పొత్తులపై ఆపార్టీ ఫోకస్ పెడుతోంది. మరోవైపు.. ప్రధాన పక్షమైన టీడీపీ, జనసేనను కలుపుకుని ముందుకు వెళ్తోంది. అయితే తమతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా కలిసి వస్తే .. వైసీపీని గట్టిదెబ్బ తీయొచ్చని ఈ పార్టీలు భావిస్తున్నాయి. బీజేపీ నుంచి ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో .. కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
క్షేత్రస్థాయిలో అధికార వైసీపీ దూకుడుగా ఉంది. అన్ని రాజకీయ పక్షాలకు ప్రత్యర్థిగా మారింది. జగన్ విధానాలను కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఒకవేళ బిజెపి రాకుంటే తాము సిద్ధంగా ఉన్నట్లు వామపక్షాలతో పాటు కాంగ్రెస్ సంకేతాలు ఇస్తోంది. అయితే జనసేన ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామి పక్షంగా ఉంది. గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాలు ఆలోచించుకుని చంద్రబాబు సైతం బిజెపి కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన బిజెపితో శత్రుత్వం పెంచుకునే ఉద్దేశం లేదు. ఒకవేళ బిజెపి స్తబ్దుగా ఉంటే మాత్రం.. కాంగ్రెస్, వామపక్షాలను దగ్గర చేసుకుంటారని టాక్ నడుస్తోంది.
క్షేత్రస్థాయిలో అన్ని పార్టీలు వైసీపీని వ్యతిరేకిస్తున్నాయి. ఏ చిన్నపాటి కార్యక్రమమైనా, ప్రభుత్వ వైఫల్యాల పైనా టిడిపి, జనసేన చేపడుతున్న నిరసనలకు వామపక్షాలు సైతం మద్దతు ప్రకటిస్తున్నాయి. తాజాగా విజయవాడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వివాదంలో అన్ని రాజకీయ పక్షాలు ఏకతాటిపైకి వచ్చాయి. కావడం విశేషం. స్వాతంత్రానికి ముందు నుంచే విజయవాడలోని ఓ భవనంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కొనసాగుతోంది. అయితే అది దేవాదాయ శాఖకు చెందినదని ప్రభుత్వం చెబుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ కోర్టును ఆశ్రయించింది. నెలరోజులపాటు కోర్టు గడువు ఇచ్చింది. ఇంతలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు ఆ భవనాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ తరుణంలో పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీనికి టిడిపి, జనసేన, వామపక్షాలు మద్దతు తెలిపాయి.
అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి పోటీకి దిగితే మాత్రం వైసీపికి గట్టిపోటీ తప్పదనే చెప్పాలి. ఎందుకంటే.. తెలంగాణను ఏకఛత్రాధిపత్యంగా పదేళ్లపాటు ఏలిన కేసీఆర్ సర్కార్ కూడా ప్రజాగ్రహానికి కుప్పకూలింది. ఇక్కడ కాంగ్రెస్ సైతం మిగిలిన పార్టీలు బరిలో లేకుండా చూసుకోవడంలో సక్సెసైంది. ఇప్పుడు ఏపీలో సైతం చంద్రబాబు అలాంటి వ్యూహాన్నే అమలు చేస్తారని టాక్ నడుస్తోంది. మరి ఇప్పుడు ఈ కూటమిలో కాంగ్రెస్, వామపక్షాలుంటాయా..? బీజేపీ వచ్చి చేరుతుందా వేచి చూడాలి.













