మార్గదర్శకత్వం చేస్తా : ముఖ్యమంత్రి చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టు పనులపై ఇక నుంచి అధికారులే సమీక్షలు నిర్వహించి, పురోగతిని ప్రతివారం తనకు వివరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సమీక్షలు మీరు నిర్వహిస్తే అవసరమయ్యే పరిష్కారాలను తాను సూచిస్తూ మార్గదర్శకత్వం చేస్తానని అన్నారు. ఫలితాలు సాధించేలా సమీక్షలు జరగాలనేది తన ఉద్దేశమని చెప్పారు. సమీక్ష సారాంశాన్ని వివరించడం ద్వారా తాను వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి, సమయాన్ని ఆదా చేయడానికి దోహదపడుతుందని అన్నారు. పోలవరం సహా 28 ప్రాధాన్య ప్రాజెక్టుల నిర్మాణానికి తలెత్తే ఇబ్బందులను తొలగించి పనులు వేగంగా, సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సైతం అధికారులదేనని స్పష్టం చేశారు. పోలవరం, ప్రాధాన్య ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో సమీక్షించారు.













