హత్య రాజకీయాలకు టిడిపి వ్యతిరేకం : చంద్రబాబు
హత్య, ఫ్యాక్షన్ రాజకీయాలకు తాము పూర్తి వ్యతిరేకమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి సృష్టం చేశారు. వాటిని ఉక్కుపాదంతో అణచివేస్తామని అన్నారు. తప్పెవరిదైనా చర్యలు తప్పవన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ప్రశాంతతకు మారుపేరని వ్యాఖ్యానించారు. యువ ఎమ్మెల్యేలు, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయని వెల్లడించారు. డ్యామ్ ఎత్తు 41.15 మీటర్ల నిర్మిస్తే 2018 నాటికి కాల్వలకు నీళ్లు ఇవ్వడం సాధ్యమవుతుందని తెలిపారు. 2019 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని అన్నారు. గ్రావిటీ ద్వారా నీరందించాలంటే భూసేకరణ పూర్తికావాలని, ఇప్పటికే ఖర్చు చేసిన నిధులను ఇవ్వాలని కేంద్రాన్ని అడుగుతున్నామని అన్నారు. పోలవరం పనులు, నిర్వాసితుల కేంద్రం నుంచి రూ.9,500 కోట్లు నిధులు రావాల్సి ఉందని వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టు సకాలంలో పూర్తి కావాలని ఆకాక్షించారు. మండువేసవిలోనూ ఇంజనీరింగ్ సిబ్బంది కష్టపడుతున్నారని ప్రశంసించారు. ఆగస్టు 15 నాటికి పురుషోత్తపట్నం ప్రాజెక్టును పూర్తి చేస్తామని, జూన్ ఒకటి నుంచి గోదావరి కాలువలకు నీటి విడుదల చేస్తామని తెలిపారు. తుపాన్లకు ముందే మొదటి పంట చేతికి అందేలా చర్యలు తీసుకుంటామని, పులిచింతల నీటితో కృష్ణా డెల్టాలో మొదటి పంటకు నీరు అందిస్తామని సృష్టం చేశారు.













