Chandrababu: కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటించారు. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటీల్ (C.R. Patil) తో చంద్రబాబు (Chandrababu) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పోలవరం (Polavaram) నిర్మాణ పురోగతితో పాటు రాష్ట్రానికి చెందిన ఇతర ప్రాజెక్టుల అనుమతులు, ఆర్థికసాయంపై చర్చించారు. జల్ జీవన్ మిషన్ (Jal Jeevan Mission) పథకానికి నిధులు తదితర అంశాలపై కేంద్రమంత్రి దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. పలు ప్రాజెక్టులకు కేంద్ర సాయం పెండింగ్‌లో ఉన్న అంశాలతో పాటు అంతరాష్ట్ర జల వివాదాలపై చర్చించారు.పోలవరం ప్రాజెక్టుకు స్టాప్ వర్కఆర్డర్ను శాశ్వతంగా ఎత్తివేసేలా నిర్ణయం తీసుకోవాలని కేంద్రమంత్రిని చంద్రబాబు కోరారు. దీని కారణంగా అవరోధాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువల సామర్థ్యం పెంపు కారణంగా పెరిగిన వ్యయాన్ని రీయింబర్స్మెంట్ చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు ఫేజ్-2కి ఆర్థిక సాయం అందించాలని, భూసేకరణ, పునరావాసం, రక్షణ కట్టలు వంటి పనులు చేపట్టాల్సి ఉందని సీఆర్ పాటిల్ దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. దీనికి అదనంగా సుమారు రూ.32 వేల కోట్లనిధులు అవసరమని చెప్పారు.
గోదావరి వరద జలాలను వర్షాభావ ప్రాంతాలకు తరలించే లక్ష్యంతో పోలవరం నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు చేపడుతున్నట్లు సీఎం తెలిపారు. తాగు, సాగు నీటితో పాటు పరిశ్రమల అవసరాలు తీర్చే కీలక ప్రాజెక్టు ఇది అని చెప్పారు. నదుల అనుసంధానంలో భాగంగా ఈ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసి సాంకేతిక, ఆర్థిక సాయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య ఉన్న వంశదార జల వివాదాలను పరిష్కరించాలని కోరారు.













