అమరావతి మనందరికీ గర్వకారణం : చంద్రబాబు
ప్రపంచంలో మన కీర్తిపతాకను రెపరెపలాడించే అమరావతి మనందరికీ గర్వకారణం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ సస్యశ్యామలం చేయనున్న పోలవరం ప్రాజెక్టు ప్రగతిదాయకమని పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సందేశంలో ఈ 2 ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రదేశాలూ సమానంగా అభివృద్ధి చెందేందుకు తమ ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి వివరించారు. ఇప్పటికే విట్, ఎస్.ఆర్.ఎం. యూనివర్సిటీలు రాజధానిలో తమ క్యాంపస్లను ప్రారంభిచాయని, బీఆర్ శెట్టి వైద్యవిజ్ఞాన సంస్థ కొద్ది రోజుల క్రితమే ఇక్కడి తన ప్రాంగణానికి భూమిపూజ జరిపిందని పేర్కొన్నారు. ఇదే బాటలో మరెన్నో విఖ్యాత విద్యాసంస్థలు అమరావతికి వస్తున్నాయన్న చంద్రబాబు, ప్రపంచంలో పేరొందిన లండన్ కింగ్స్ హాస్పిటల్ రూ.1000 కోట్లతో ఇక్కడ నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి ఈ నెల 16న శంకుస్థాపన జరుగుతుందన్నారు. రాజధానితోపాటు ప్రతి జిల్లాను ప్రగతికి చిహ్నంగా నిలిచేలా, వాటి భౌగోళిక స్థితిగతులు, లభ్యమయ్యే సహజ వనరుల ఆధారంగా కార్యచరణ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. పురుషోత్తపట్నం లిప్ట్ ఇరిగేషన్ స్కీమును స్వాతంత్య్ర దినాన ప్రారంభించబోతున్నామని తెలిపారు.













