Chandrababu: చంద్రబాబు డీప్‌ఫేక్ వీడియోలతో ఘరానా మోసం.. బలైపోయిన తెలంగాణ టీడీపీ నాయకులు..

టెక్నాలజీ (Technology) పెరుగుతున్న కొద్ది ప్రపంచం వేగంగా మారిపోతోంది. కానీ దాన్ని మంచికంటే చెడుకు ఉపయోగించే వారి సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) రాష్ట్రాలను కుదిపేసిన ఒక మోసం దీనికి ఉదాహరణగా నిలిచింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence – AI) సహాయంతో తెలుగుదేశం పార్టీ (TDP) అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమ (Devineni Uma) ముఖాలను ఉపయోగించి నకిలీ వీడియో కాల్స్ సృష్టించి, తెలంగాణ టీడీపీ నాయకులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి (Sattupalli) ప్రాంతంలో మొదలైంది. ఓ యువకుడు దేవినేని ఉమ వ్యక్తిగత సహాయకుడిని అని చెప్పి కొందరు టీడీపీ నేతలకు ఫోన్ చేశాడు. కాసేపట్లో దేవినేని ఉమ సార్ వీడియో కాల్ చేస్తారని చెప్పి నమ్మబలికాడు. కొద్ది సేపటికి దేవినేని ఉమలా కనిపించే వ్యక్తి వీడియోలో కనిపించి మాట్లాడడం ఆ నేతలకు నిజమనే నమ్మకాన్ని కలిగించింది. ఆ నకిలీ వ్యక్తి టీడీపీ కార్యకర్తల పిల్లల చదువుకు సహాయం చేయాలనుకుంటున్నామని చెబుతూ, మూడు వేర్వేరు ఫోన్ పే నంబర్లకు డబ్బు పంపించాలని కోరాడు. నాయకుడు విశ్వసించి రూ. 35 వేల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేశాడు.
అంతటితో ఆ మోసం ఆగలేదు. కొన్ని రోజుల తరువాత మళ్లీ అదే వ్యక్తి ఫోన్ చేసి, రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇప్పిస్తానని చెప్పాడు. కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు వీడియో కాల్ చేస్తారని చెప్పడంతో, ఆ నేతలు ఉత్సాహంతో ఎదురుచూశారు. చెప్పినట్లుగానే చంద్రబాబు ముఖంతో పోలిన వ్యక్తి వీడియో కాల్ చేసి మాట్లాడడంతో వారు మరింత విశ్వసించారు. ఆ తరువాత, విజయవాడ (Vijayawada) కి వస్తే బీ ఫారం ఇస్తానని చెప్పి, హోటల్ అడ్రస్ పంపించాడు.
విజయవాడ చేరుకున్న నాయకులు ఆ హోటల్‌లో బస చేయగా, మోసగాడు హోటల్ బిల్లు కూడా తాము చెల్లిస్తామని చెప్పాడు. ఆ తర్వాత మళ్లీ కాల్ చేసి, చంద్రబాబును కలిసేందుకు కేవలం 8 మందికే అవకాశం ఉందని, ఒక్కొక్కరు రూ. 10 వేలు అదనంగా చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఈలోగా హోటల్ బిల్లుపై హోటల్ సిబ్బందితో టీడీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనను గమనించిన పోలీసులు జోక్యం చేసుకున్నారు.
పోలీసులు నేరుగా దేవినేని ఉమకు కాల్ చేసి వివరాలు అడగగా, తాను ఎవరికీ ఫోన్ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. అప్పుడు నాయకులు తాము పూర్తిగా మోసపోయామని గ్రహించి షాక్ అయ్యారు. దర్యాప్తులో ఈ మోసం ఏలూరు (Eluru) ప్రాంతానికి చెందిన ఓ యువకుడు చేశాడని గుర్తించారు.కానీ పరువు పోతుందనే భయంతో ఆ తెలంగాణ టీడీపీ నేతలు ఫిర్యాదు చేయకుండా మౌనం వహించారు. ఈ సంఘటన తో డీప్‌ఫేక్ (Deepfake) ఎంతటి ప్రమాదకర స్థాయికి చేరిందో, సినీ నటులతో పాటు రాజకీయ నాయకులు కూడా ఎలా బలవుతారో చూపించే తాజా ఉదాహరణగా నిలిచింది.