రాజకీయాలను కాదు.. అన్యాయాన్ని హైలెట్ చేయాలి
రాజకీయాలను హైలెట్ చేయవద్దని, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని హైలెట్ చేయండని అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ మీడియాకు విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని, అందుకోసమే ఢిల్లీ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకోవడమే తమ సామర్థ్యమని తెలిపారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే రెండురోజుల ఢిల్లీ పర్యటన చేపట్టినట్లు తెలిపారు. ఈ పర్యట రాజకీయ ప్రయోజనాల కోసం కాదని సృష్టం చేశారు. ఎంపీలంతా కేంద్రం నుంచి రావాల్సిన రాష్ట్ర ప్రయోజనాలపై పోరాడాలని సూచించారు.
ఈ రోజు ఢిల్లీ వస్తున్నానని, రేపు, ఎల్లుండి ఢిల్లీ వేదికగా రాష్ట్ర ప్రయోజనాల సాధనపై దృష్టి సారించనున్నట్లు ఎంపీలతో అన్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాలువో వివిధ పార్టీల సభాపక్ష నేతలను కలువనున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై వ్యక్తిగతంగా వివరిస్తామన్నారు. కాంగ్రెస్ రాష్ట్రానికి అన్యాయం చేస్తే, బీజేపీ నమ్మించి మోసం చేసిందని మండిపడ్డారు. అత్యున్నత చట్టసభల్లో ఇచ్చిన హామీలకు విలువలేదా? అని ప్రశ్నించారు. ఏపీకి ఎందుకు న్యాయం చేయరని? కేంద్రానికి బాధ్యత లేదా అంటూ నిలదీశారు. ఢిల్లీలోనే కాదు, రాష్ట్రం యావత్తూ తన పర్యటనపై అంచనాలున్నాయని ఎంపీలతో అన్నారు. ప్రజల్లో ఆకాంక్షలున్నాయన్నారు. ఏపీ పునర్వవస్థీకరణ చట్టంలోని 19 అంశాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఇచ్చిన 6 హామీలు నెరవేర్చాలన్నారు. వైసీపీ లాలూచీ రాజకీయాలు ప్రజలకు అర్థమయ్యాయని తెలిపారు. ఎన్నికలంటే వైసీపీ భయం, అందుకే పార్లమెంట్ చివరిరోజున రాజీనామాలకు తెరతీశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కోరారు. పొరుగు రాష్ట్రాలతో సమానస్థాయి వచ్చేదాక కేంద్రం చేయూత ఇవ్వాలని డిమాండ్ చేశారు.













