వ్యవసాయంలో దేశానికి ఏపీ ఆదర్శం : చంద్రబాబు
గతంలో ఐటికి ప్రాధాన్యత నివ్వడంతో ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని, ప్రస్తుతం వ్యవసాయానికి ప్రాధాన్యత నిస్తూ సాంకేతిక సహకారంతో దేశానికే ఆదర్శంగా నిలిచేలా కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అగ్రిటెక్ 2వ రోజు సదస్సులో ముఖ్యమంత్రి ప్రసంగించారు. మూడురోజుల సదస్సులో శాస్త్రవేత్తలు, పరిశోధకులు వివరించిన ఆధునిక పద్ధతులను తెలుసుకొని రాష్ట్రంలో వాటిని అమలుచేయడం జరుగుతుందన్నారు. ఐటి వినియోగించడం వల్ల జవాబు దారీతనం, వేగం, పారదర్శకత పెరుగుతుందని, ప్రపంచంలో వున్న ఐటీ నిపుణుల్లో ప్రతి నలుగురిలో భారత దేశంలో ఒకరుంటే, ఆ నలుగురిలో ఏపీ నుంచి ఒకరుంటున్నారని అన్నారు.
వ్యవసాయం ప్రస్తుతం సంక్షోభంలో వుందని, ప్రజల ఆహారపు అలవాట్లు మారిపోయాయని వాటికి తగ్గుట్టుగా ఉత్పత్తులు కూడా మారాల్సిన అవసరం వుందని అన్నారు. పండ్లు, కూరగాయల వినియోగం ఎక్కువగా వున్నందున భవిష్యతులో ఒక కోటి ఎకరాల్లో ఉద్వాన సాగుచేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామన్నారు. రాష్ట్రంలో సాగునీటి సమస్య కూడా వుందని, కోటీ ఎకరాలకు సాగు నీరందించేలా ప్రణాళికలను సిద్దం చేస్తున్నామన్నారు. వ్యవసాయ రంగంలో అనేక సవాళ్లు వున్నాయని సన్నాకారు, మధ్యతరహా రైతులే ఎక్కువగా ఉన్నారని, వీరితో పాటు కౌలు రైతులు కూడా వున్నారని వీరిని దృష్టిలో ఉంచుకొని ఒకవైపు టెక్నాలజీ, మరో వైపు వ్యవసాయం రెండూ సమాంతరంగా అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్నామన్నారు.













