అది అరెస్ట్ కాదు కిడ్నాప్…

అచ్చెన్నకు ఏమైనా జరిగితే జగన్‌దే బాధ్యత
హోంమంత్రి రాజీనామా చేయాలి
ఇది బహీనవర్గాలపై దాడి: చంద్రబాబు
తన కుడిభుజం లాంటి అచ్చెన్నాయుడుని ప్రభుత్వం అరెస్ట్ చేయడంపై తేదేపా అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది జగన్ ప్రభుత్వ కుట్ర అని ఆరోపించారు. బడుగు బహీన వర్గాలకు చేస్తున్న మోసం, అన్యాయాలపై అచ్చెన్నాయుడు నిరంతరం పోరాడుతూ ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నారని ఇది సహించలేని జగన్ ప్రభుత్వం చట్ట విరుద్ధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఆయనపై కక్ష సాధిస్తున్నారన్నారు. అర్ధరాత్రి 100 మంది పోలీసులతతో ఆయన ఇంటిపై దాడి చేసి అక్రమంగా కిడ్నాప్ చేశారని ఆరోపించారు. అచ్చెన్నాయుడికి ఇటీవలే సర్జరీ జరిగిందని, పోలీసులు ఆయనను మందులు వేసుకోవడానికి కూడా అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు ఫోన్లో కాంటాక్ట్ చేసినా నేను ఫోన్ చేసినా అచ్చెన్నాయుడు ఫోన్ అందుబాటులో లేదని, ఇది జగన్ అరాచకం, ఉన్మాదం తప్ప మరేమీ కాదు… పిచ్చి పరాకాష్టకు చేరినట్లుగా ఉన్నది. ప్రజల్లో జగన్ మోసాలకు, అవినీతికి వ్యతిరేకంగా వస్తున్న అసంతృప్తి ఫ్రస్ట్రేషన్‌గా మారి ఈ రకమైన ఉన్మాద చర్యలకు ఒడికడుతున్నారన్నారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా, తనను ఎక్కడకు తీసుకువెళ్ళారో ఎందుకు తీసుకెళ్లారో చెప్పలేదని, ఈ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీనికి సీయం జగన్, హోంమంత్రి, డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ శాసనసభాపక్ష ఉపనేతగా ఉన్న అచ్చెన్నాయుడుకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కిడ్నాప్ చేయడం చట్టాన్ని ఉల్లంఘించడంకాక మరేమిటని ప్రశ్నించారు.
బలహీనవర్గాలపై దాడి..
బహీనవర్గాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 34% నుండి 24% తగ్గించారు… బీసీ సబ్‌ప్లాన్ నిధులు డైవర్ట్ చేశారు… ముఖ్యమైన నామినేషన్ పదవుల్లో బీసీలకు మొండిచేయి చూపించారు… సంక్షేమ పథకాల్లో కోతలు విధించారు. వీటన్నింటినీ శాసనసభా వేదికగాను, ఇతరత్రా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రజలకు తెలియజేసినందువల్ల దానిని సహించలేక జగన్ చట్టవ్యతిరేకంగా కిడ్నాప్ చేశారు. ఈ దుర్మార్గానికి, ఉన్మాద చర్యలకు, అధికార దుర్వినియోగ చర్యలకు నిరసనగా బడుగుబహీనవర్గాలు ప్రజలు, మేధావులు, ప్రజలు నిరసన తెలియజేసి జోతిరావుఫూలే, అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించి నిరసనను తెలియజేయవసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ చంద్రబాబు పత్రికా ప్రకటన విడుదల చేశారు.











































































