ఎన్డీయేలో టీడీపీ చేరికకు ముహూర్తం ఖరారు..!
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీని ఓడించేందుకు టీడీపీ, జనసేన ఇప్పటికే ఏకతాటిపైకి వచ్చాయి. అయితే అటు బీజేపీతో కూడా జనసేన పొత్తులో ఉంది. అందుకే బీజేపీని కూడా టీడీపీతో కలిసి వచ్చేలా ప్రయత్నించారు జనసేనాని పవన్ కల్యాణ్. ఇప్పుడు బీజేపీ కూడా పొత్తుకు సిద్ధమైంది. దీంతో ఎన్డీయేలో టీడీపీ చేరికకు ముహూర్తం దాదాపు ఖరారైంది. ఢిల్లీలో బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించబోతున్నారు. పొత్తు ఖరారైన తర్వాత సీట్ల పంపకాలపై దృష్టి పెట్టనున్నారు.
ఇవాళ, రేపు ఢిల్లీలో బీజేపీ పదాధికారుల సమావేశం జరుగుతోంది. రాష్ట్రాల వారీగా కీలక నేతలంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్రాలవారీగా బీజేపీ అధిష్టానం చర్చలు జరుపుతోంది. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు ఏపీ బీజేపీ నేతలు కూడా తరలి వెళ్లారు. అధిష్టానంతో చర్చల్లో టీడీపీతో పొత్తుపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షా, నడ్డాలతో సమావేశమయ్యారు. దీంతో పొత్తు దాదాపు ఖరారైందని తెలిసింది. అయితే ఎన్ని సీట్లలో పోటీ చేయాలి.. ఏఏ సీట్లలో పోటీ చేయాలి.. లాంటి అంశాలపై బీజేపీ ఇంకా క్లారిటీకి రావాల్సి ఉంది. ఇప్పుడు బీజేపీ నేతలంతా ఢిల్లీలోనే ఉండడంతో ఈ విషయంపై క్లారిటీ రానుంది.
మరోవైపు.. బీజేపీతో పొత్తుపై టీడీపీ అయిష్టంగానే అంగీకరించింది. గతంలో బీజేపీతో కలిసి వెళ్లి తీవ్రంగా వ్యతిరేకించి బయటికొచ్చింది టీడీపీ. అయితే ఇప్పుడు మళ్లీ అదే పార్టీతో కలిసి పని చేయాల్సి వస్తోంది. అయితే రాష్ట్ర ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాల దృష్ట్యా బీజేపీతో కలిసి వెళ్తేనే మేలనే ఉద్దేశంతో టీడీపీ ఈ నిర్ణయం తీసుకుంది. బీజేపీ పదాధికారుల సమావేశం 18వ తేదీ ముగుస్తుంది. అనంతరం 20న టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. అప్పుడు మూడు పార్టీలూ కలిసి పొత్తుపై అధికారికంగా వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.
ఢిల్లీలో ఎన్డీయేలో చేరికపై అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఎక్కడెక్కడ ఏఏ పార్టీ పోటీ చేస్తుంది.. అనే అంశాలపై క్లారిటీ రానుంది. బీజేపీ పదికి పైగా అసెంబ్లీ, ఏడెనిమిది పార్లమెంటు స్థానాలు అడుగుతున్నట్టు సమాచారం. మరోవైపు జనసేన 30 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలు కోరుతోంది. అయితే ఆ రెండు పార్టీలకూ కలిపి 30-35 స్థానాలకు మించి అసెంబ్లీ స్థానాలు ఇవ్వకూడదనే ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే పార్లమెంటు స్థానాల విషయంలో మాత్రం కాస్త చూసీచూడనట్లు వెళ్లేందుకు ఆయన సుముఖంగా ఉన్నట్టు సమాచారం.













