కూటమిలో ఒంటరైన బీజేపీ..! సీట్లపై తేల్చని అధిష్టానం..!
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ ను గద్దె దింపేందుకు విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. టీడీపీ, జనసేన ముందు నుంచి కలిసి నడవగా ఇటీవల బీజేపీ కూడా కూటమిలో చేరింది. అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన జగన్ ను ఓడించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నట్టు మూడు పార్టీలూ ప్రకటించాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చకుండా సొమ్ము చేసుకునేందుకే తాము ఐక్యంగా ముందుకు వెళ్తున్నట్టు ఆయా పార్టీల అధినేతలు వెల్లడించారు. అయితే ప్రకటనల వరకూ బాగానే ఉంది కానీ కూటమిలో ఇప్పటి వరకూ ఇంకా ఐక్యత వచ్చినట్లు కనిపించడం లేదు.
ఏపీలో ఎలాగైనా జగన్ ను ఓడించాలనే పట్టుదలతో టీడీపీ, జనసేన ముందు నుంచే పోరాడుతున్నాయి. ఆ రెండు పార్టీలూ చాలాకాలంగా ఉమ్మడిగా ముందుకు సాగుతున్నాయి. అదే క్రమంలో ఆ రెండు పార్టీలూ ఉమ్మడిగా ఒకేసారి 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. దీంతో బీజేపీ ఇక కూటమిలో చేరకపోవచ్చని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఢిల్లీలో రెండు రోజుల పాటు సుదీర్ఘ చర్చల అనంతరం బీజేపీ కూడా కూటమిలో చేరింది. టీడీపీ కూడా ఎన్డీయేలో చేరిపోయింది. దీంతో మూడు పార్టీలూ ఏకతాటి పైకి వచ్చాయి.
మూడు పార్టీలూ జట్టు కట్టిన తర్వాత ప్రధాని మోదీతో చిలకలూరిపేటలో భారీ బహిరంగసభను కూడా ఏర్పాటు చేశాయి. ఈ సభ సక్సెస్ కావడంతో అన్ని పార్టీల్లో జోష్ కనిపిస్తోంది. అయితే టీడీపీ, జనసేన రెండో లిస్టు కూడా అనౌన్స్ చేసేశాయి కానీ బీజేపీ మాత్రం ఇప్పటికీ ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. కనీసం బీజేపీ ఏఏ స్థానాల్లో పోటీ చేస్తుందో కూడా చెప్పలేదు. దీంతో ఇప్పటికీ ఆ పార్టీల నేతల్లో కాస్త గందరగోళం కనిపిస్తోంది. పైగా టీడీపీ, జనసేన పొత్తును వ్యతిరేకిస్తున్న కొంతమంది నేతలు హైకమాండ్ కు లేఖ రాశారు. దీంతో పొత్తుపై మళ్లీ అనుమానాలు తలెత్తాయి.
టీడీపీ, జనసేన నేతలు నియోజకవర్గాల్లో ఇప్పటికే కలిసి పనిచేస్తున్నారు. ఆ పార్టీల హైకమాండ్స్ కూడా పార్టీ శ్రేణులకు కలిసి పనిచేయాలని ఆదేశించాయి. దీంతో అన్నిచోట్ల ఆ రెండూ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం ఇప్పటికీ టీడీపీ, జనసేనతో కలిసి పనిచేయట్లేదు. పొత్తు కుదిరింది కాబట్టి కేడర్ అంతా వాళ్లతో కలిసి పనిచేయాలని పార్టీ కూడా ఆదేశించలేదు. దీంతో అన్ని చోట్లా బీజేపీ నేతలు స్తబ్దుగా ఉండిపోతున్నారు. టీడీపీ, జనసేనతో కలవట్లేదు. దీంతో టీడీపీ, జనసేన కూడా కాస్త గందరగోళంగానే ఉన్నాయి. సీట్లపై బీజేపీ త్వరగా తేల్చి కేడర్ కు ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందనే టాక్ వినిపిస్తోంది.













