భూమా కుటుంబానికి అరుదైన రికార్డు
ప్రజాస్వామ్య వ్వవస్థలో ఏదైనా సాధ్యమే. అందులోనూ రాయలసీమ వంటి వర్గాధిపత్యాలు ఉన్న నియోజకవర్గాల్లో ఒకేకుటుంబం నుంచి అత్యధికులు చట్ట సభలకు ప్రాతినిధ్యం వహించటం అరుదైన రికార్డే. కర్నూలు జిల్లా బలమైన రాజకీయ కుటుంబంగా భూమా కుటుంబానికి ఈ అరుదైన గౌరవం లభించింది. ఒకే కుటుంబం నుంచి 5 మంది రాష్ట్ర శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. 1989లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భూమా వీరశేఖరరెడ్డి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1991లో ఆయన గుండేపోటుతో అకాల మరణం చెందారు. ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో భూమా వీరశేఖర్ రెడ్డి సోదరుడు భూమా వెంకట నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. తరువాత నాగిరెడ్డి 1996లో నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికయ్యారు. ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న తన స్థానానికి రాజీనామా చేశారు. దీంతో 1997లో జరిగిన ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో నాగిరెడ్డి సతీమణి భూమా శోభారాణి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. 2014లో ఎన్నికల సందర్భంలో శోభ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో ఆళ్లగడ్డ స్థానానికి మళ్లి ఉప ఎన్నికలు జరిగ్గా ఈ సారి భూమా కుటుంబ నుంచి నాగిరెడ్డి పెద్ద కూతురు అఖిలప్రియ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొంది ప్రస్తుతం చంద్రబాబు మంత్రివర్గంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.
2014లో జరిగిన ఎన్నికల్లో నంద్యాల నుంచి గెలుపొందిన భూమా నాగిరెడ్డి ఆకస్మిక మృతితో తాజాగా నంద్యాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భూమా కుటుంబం నుంచి మాజీ ఎమ్మెల్యే వీరశేఖరరెడ్డి తనయుడు భూమా బ్రహ్మానందరెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. దీంతో భూమా కుటుంబం నుంచి శాసనసభకు ఎన్నికయిన వారిలో 5వ వారిగా నిలిచి రాజకీయ రంగంలో అరుదైన గౌరవాన్ని భూమా కుటుంబానికి అందించారు. అంతే కాకుండా తన చిన్నాన్న స్థానాన్ని నంద్యాలలో భర్తీ చేసి ఈ నియోజకవర్గానికి 12వ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం పొంది మరో రికార్డును సొంతం చేసుకున్నారు.













