స్వరూపానందేంద్రతో వైసీపీకి గ్యాప్ పెరిగిందా..?
విశాఖ శారదాపీఠం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ పీఠాధిపతి స్వరూపానందేంద్ర అందరికీ సుపరిచితులు. ఆయన యాగాలు, యజ్ఞాలతో రాజకీయ నాయకులకు ఎంతో దగ్గరయ్యారు. నేతలు కూడా ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఏపీ సీఎం వై.ఎస్.జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ సహా పలువురు రాజకీయ నేతలు స్వరూపానందేంద్ర ఆశీస్సుల కోసం పడిగాపులు కాస్తుంటారు. అయితే స్వరూపానందేంద్ర కూడా రాజకీయ నాయకులతో కలిసిపోయి వాళ్లకు దీవెనలు అందజేస్తుంటారు. ముఖ్యంగా వైసీపీ అధినేత, ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డితో స్వరూపానందేంద్ర అత్యంత సన్నిహితంగా ఉంటారు.
2019 ఎన్నికలకు ముందు నుంచీ కూడా శారదాఫీఠాధిపతి స్వరూపానందేద్ర జగన్ అనుకూలురుగా ముద్ర వేసుకున్నారు. జగన్ కు అనుకూలంగా స్టేట్ మెంట్లు ఇవ్వడం, అప్పటి టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం చేస్తుండే వారు. దీంతో స్వరూపానందేంద్ర వైసీపీకి అత్యంత సన్నిహితంగా మారారు. ఆ తర్వార వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయన ఆనందానికి అవధుల్లేవు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే సీఎం హోదాలో జగన్ శారదాఫీఠాన్ని సందర్శించారు. అప్పుడు సీఎం జగన్ నుదుటిన ముద్దుపెట్టి ఆలింగనం చేసుకున్నారు. అది అప్పట్లో పెద్ద సంచలనం కలిగించింది. ఒక స్వామీజీ అయి ఉండి అలా ఓ వ్యక్తికి ముద్దు పెట్టడం, ఆలింగనం చేసుకోవడం ఆశ్చర్యం కలిగించింది.
అప్పటి నుంచి కూడా స్వామీజీకి, వైసీపీకి మధ్య సత్సంబంధాలు కొనసాగుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు ఏమైందో ఏమో ఒక్కసారిగా స్వరూపానందేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. సింహాచలం అప్పన్న చందనోత్సవం సందర్భంగా స్వరూపానందేంద్ర ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి ఏర్పాట్లు చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన జీవితంలో ఇలాంటి చెత్త ఏర్పాట్లు చూడలేదన్నారు. అసలు తాను దర్శనానికి ఎందుకు వచ్చానా.. అని బాధపడుతున్నట్టు చెప్పారు. ప్రభుత్వ తీరు ప్రజలను దేవుడి దర్శనానికి దూరం చేసేలా ఉందన్నారు. దీంతో వైసీపీ నేతలంతా ఆశ్చర్యపోయారు. మన స్వామీజీ ఇలా మాట్లాడుతున్నారేంటి అని హతాశులయ్యారు. వెంటనే తేరుకుని స్వామీజీపై విమర్శల వర్షం కురిపించడం మొదలు పెట్టారు.
ఇంతలోనే స్వామీజీ మనసు మార్చుకున్నారో ఏమో.. వెంటనే తాను అలా మాట్లాడలేదన్నారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆలయాల విషయంలో జగన్ సర్కార్ మొదటి నుంచి ఇదే వైఖరి అవలంబిస్తోందని, ఇప్పటికి స్వామీజికి కూడా అర్థమైందని విపక్షాలు ఆరోపించడం మొదలు పెట్టాయి. ఇప్పటికైనా స్వరూపానందేంద్ర వాస్తవాలు మాట్లాడడం సంతోషకరమన్నాయి. ఏదేమైనా ఇప్పుడు స్వరూపానందేంద్ర వ్యాఖ్యలు వైసీపీకి పెద్ద డ్యామేజ్ కలిగించాయి.













