పాపం కారుమూరి..! ఎర్రిపప్ప అయిపోయారుగా..!?
నోరు జారితే తిరిగి తీసుకోలేం. అందుకే మాట్లాడేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మరీ మాట్లాడాలి. పబ్లిక్ లైఫ్ లో ఉండే వాళ్లు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నేతలు, సినిమా తారలు చాలా మంది గతంలో నోరు జారి తర్వాత నాలుక కరుచుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. ఒకసారి ఆ మాట బయటికొచ్చేశాక తిరిగి తీసుకోలేరు. దాని పరిణామాలు అనుభవించడం తప్ప. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు పరిస్థితి కూడా ఇంతే.! నోరు జారి దాన్ని కవర్ చేసుకునేందుకు మరోసారి నోరుజారి.. ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డారు.
ఆంధ్రప్రదేశ్ లో అకాల వర్షాలు అన్నదాతకు భారీ నష్టాన్ని కలిగించాయి. అయినా ప్రభుత్వం నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో పర్యటించారు. ఆయన రైతులు పడుతున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అప్పటివరకూ పట్టించుకోని అధికార యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగింది. మంత్రులు రైతుల దగ్గరకు వెళ్లడం మొదలు పెట్టారు. అలా తణుకు మండలం వేల్పూరు గ్రామానికి వెళ్లారు మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావు. అక్కడ అకాల వర్షానికి నష్టపోయిన పొలాల్లో పర్యటించారు. పంట నష్టాన్ని చూశారు.
ఈ క్రమంలో ఓ రైతు మంత్రికి తన గోడు వెళ్లబోసుకున్నారు. అకాల వర్షానికి పంట తీవ్రంగా కోల్పోయామని, ప్రభుత్వమే ధాన్యం కొని తమను ఆదుకోవాలని చెప్పుకొచ్చారు. అందరి ముందూ తనను రైతు నిలదీసేసరికి మంత్రి కోపం వచ్చేసింది. “ఎర్రిపప్పా.. వరదలొస్తే నేనం చేసేది” అనేశారు. దీంతో అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. మంత్రి అలా మాట్లాడడంపై అనేక విమర్శలు వ్యక్తమయ్యాయి. రైతులకు మంత్రి ఇచ్చే గౌరవం ఇదేనా అని సోషల్ మీడియాలో మండి పడ్డారు. రైతును పట్టుకుని ఎర్రిపప్పా అనడంపై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు.
ఈ ఎర్రిపప్పా కామెంట్ ఎటో వెళ్లిపోతోందని గమనించారు మంత్రి కారుమూరి. ఓ చానల్ ఇంటర్వ్యూకు ఇస్తూ ఎర్రిపప్పా అంటా బూతు కాదని, బుజ్జికన్నా అని అర్థమని కొత్త భాష్యం చెప్పారు. అంతే.. సోషల్ మీడియాలో మరోసారి కారుమూరి హెడ్ లైన్ గా మారారు. అందరూ మంత్రినే ఎర్రిపప్పా.. బుజ్జికన్నా.. అంటూ సెటైర్స్ వేయడం మొదలు పెట్టారు. అంతటితో ఆగకుండా… వైసీపీ నేతలంతా ఎర్రిపప్పలేనా…? అంటే బుజ్జికన్నలేనా..? అంటూ సెటైరికల్ పంచ్ లు వేస్తున్నారు. ఓ మంత్రి చేసిన కామెంట్.. ఇప్పుడు నేతలందరికీ ఆపాదిస్తూ జోకులు పేల్చుకుంటున్నారు నెటిజన్లు.













