జగన్.. ఇదేనా మీ సామాజిక న్యాయం..? నెట్టింట ట్రోల్స్..!!
ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్లపాటు అధికారంలో ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. సంక్షేమానికి పెద్దపీట వేశాని ఆ పార్టీ చెప్పుకుంటోంది. అధికారంలో ఉన్నన్ని రోజులు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఊదరగొట్టెవారు. వాళ్లంతా తమ పేటెంట్ అని ఆ పార్టీ నేతలు ఫీలయ్యే వారు. అయినా ప్రయోజనం లేకపోయింది. తాజా ఎన్నికల్లో వాళ్లెవరకూ జగన్ కు అండగా నిలవలేదని అర్థమైంది. ఇన్నాళ్లూ వాళ్లను అడ్డు పెట్టుకుని తమ వాళ్లను అందలం ఎక్కించడం వల్లే ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చిందని విశ్లేషకులు చెప్తున్నారు. అయినా ఇప్పటికీ జగన్ లో మార్పు మాత్రం కనిపించడం లేదు.
జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ రెడ్డి సామాజిక వర్గానికే పెద్దపీట వేశారు. ముఖ్యమంత్రి మొదలు కింది స్థాయి అధికారుల వరకూ అన్ని పేషీల్లో రెడ్డి వర్గీయులే స్థానం దక్కించుకున్నారు. సలహాదారులు, నామినేటెడ్ పోస్టులన్నీ వాళ్లతోనే నింపేశారు. దీన్ని కప్పి పుచ్చుకునేందుకు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనే ప్రకటనలు కుమ్మరించేవారు. పార్టీ తరపున వాళ్లకు మెజారిటీ సీట్లు ఇచ్చామని చెప్పుకుంటూ వచ్చారు. అయితే వాళ్లపై పెత్తనం చెలాయించేది మాత్రం మళ్లీ రెడ్లే.! అందుకే ఈ ఎన్నికల్లో వైసీపీకి దారుణ పరాభవం ఎదురైంది. వైసీపీ నమ్ముకున్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కూడా ఆ పార్టీకి దూరమయ్యారు.
ఎన్నికల్లో ఓడిన తర్వాతైనా జగన్ తన మాటలకు కట్టుబడి సామాజిక న్యాయం చేస్తారని అందరూ అనుకున్నారు. ఫలితాలపై పునస్సమీక్ష చేసుకుని అందుకు తగ్గట్లు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారని భావించారు. అయితే జగన్ లో అలాంటి మార్పు కనిపించట్లేదని అర్థమవుతోంది. తాజాగా వైసీపీ ఎంపీలతో జగన్ సమావేశమయ్యారు. ఇందులో లోక్ సభాపక్ష నేతగా మిథున్ రెడ్డి వ్యవహరిస్తారని చెప్పారు. అలాగే రాజ్యసభ పక్ష నేతగా విజయ సాయి రెడ్డి ఉంటారన్నారు. ఇక పార్లమెంటరీ పార్టీ నేతగా వై.వి.సుబ్బారెడ్డి బాధ్యతలు తీసుకుంటారని జగన్ వెల్లడించారు. పార్లమెంటులో వైసీపీకి 15 మంది సభ్యుల బలం ఉంది. ఇందులో బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఎంతో మంది ఉన్నారు. అయినా జగన్ మాత్రం మూడు పదవులనూ రెడ్లకే అప్పగించారు.
అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తారు. పార్లమెంటులోని మూడు పదవులూ రెడ్లకే కట్టబెట్టారు. పార్టీ వ్యవహారాలన్నింటినీ సజ్జల రామకృష్ణా రెడ్డి చూస్తున్నారు.. ఇలా పార్టీలో అయినా, పదవుల్లో అయినా రెడ్లు తప్ప మరొకరు వైసీపీలో కనిపించట్లేదనే సెటైర్లు సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా కనిపిస్తున్నాయి. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్పుకున్న జగన్.. ఇప్పుడు వాళ్లకు ఎందుకు పదవులు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. అలాంటి మాటలన్నీ ప్రకటనలకే పరిమితమా అని నిలదీస్తున్నారు. ఇదేనా జగన్ మీ సామాజిక న్యాయం అని ప్రశ్నిస్తున్నారు.













