బాలినేని శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు..! వైసీపీలో హాట్ టాపిక్..!!
వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కామెంట్స్ ఇప్పుడు హాట్ హాట్ గా మారాయి. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బాలినేని కీలక నేత. కొంతకాలంగా ఆయన పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అడపాదడపా పార్టీపై అవాకులు చవాకులు పేలుతున్నారు. సీఎం జగన్ పిలిపించి మాట్లాడిన తర్వాత పరిస్థితి సద్దుమణుగుతుందని అందరూ భావించారు. అన్నట్టుగానే జగన్ తో భేటీ అయి బయటకు వచ్చిన తర్వాత ఇప్పటివరకూ ఆయన నోరు మెదపలేదు. అయితే ఇప్పుడు మళ్లీ నోరు విప్పారు. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
పార్టీలో తనను అణగదొక్కేందుకు అయిన వాళ్లే ప్రయత్నిస్తున్నారని బాలినేని శ్రీనివాస రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలులోనే రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించానన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఎవరు అడ్డొస్తారో చూస్తానని హెచ్చరించారు. కార్యకర్తలకోసం ఎవరైనా ఎదిరించేందుకు సిద్ధంగా ఉన్నానని బాలినేని తేల్చి చెప్పారు. సీఎం జగన్ ను తప్ప ఎవరినీ లెక్క చేయనని స్పష్టం చేశారు. బాలినేని కామెంట్స్ ఇప్పుడు వైసీపీలో తీవ్ర రచ్చ రాజేస్తున్నాయి.
జిల్లాలో వైవీ సుబ్బారెడ్డికి, బాలినేని శ్రీనివాస రెడ్డికి పొసగట్లేదు. పార్టీ అధినేత జగన్ .. వైవీ సుబ్బారెడ్డి వైపే ఉంటున్నారనే ఆవేదన బాలినేనిలో ఉంది. జిల్లాలో తనను తొక్కేసేందుకు వైవీ సుబ్బారెడ్డి ప్రయత్నిస్తున్నారని, తనకు మంత్రి పదవిని తీసేసినప్పటి నుంచి జిల్లా నేతలు, యంత్రాంగం అంతా ఆయన చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆయన ఫీలవుతున్నారు. మరోవైపు మంత్రి ఆదిమూలపు సురేశ్ కూడా బాలినేనికి కంటిలో నలుసులా మారారు. ఇవన్నీ బాలినేని జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ ప్రారంభించకముందు నుంచి తాను జగన్ వెంట నడిచినా ఇప్పుడు తనను పక్కన పెడుతుండడాన్ని బాలినేని తట్టుకోలేకపోతున్నారు.
జిల్లాలో ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే వచ్చే ఎన్నికల నాటికి బాలినేని అడుగులు ఎలా ఉంటాయనేది జిల్లాలో ఆసక్తి కలిగిస్తోంది. వైసీపీలో బాలినేని ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటన్నింటినీ ఇటీవల జగన్ ను కలిసినప్పుడు బాలినేని వివరించారు. అన్నీ తాను చూసుకుంటానని సీఎం మాటిచ్చారు. ఆ మేట మేరకు బాలినేని సంయమనం పాటిస్తున్నారు. అయితే ఏదైనా తేడా జరిగితే తాను సొంత నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సన్నిహితుల దగ్గర ఇప్పటికే బాలినేని హింట్ ఇస్తున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు మారకపోతే బాలినేని సంచలన నిర్ణయం తీసుకోవచ్చనే టాక్ వినిపిస్తోంది.













