ఏపీలో కూటమి ముందున్న సవాళ్లు ఇవే..!
ఆంధ్రప్రదేశ్ లో పొత్తులు కొలిక్కి వచ్చాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. తెలుగుదేశం పార్టీ 145 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయనుంది. జనసేన, బీజేపీ కలిసి 30 అసెంబ్లీ, 8 లోక్ సభ సీట్లలో బరిలోకి దిగేందుకు అంగీకరించాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన 99 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించాయి. మిగిలిన చోట్ల ఇప్పుడు మూడు పార్టీలూ కూర్చొని చర్చించుకుని అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ కూటమి ముందు అనేక సవాళ్లున్నాయి.
2014 నుంచి 2018 వరకూ టీడీపీ, బీజేపీ కలిసే పని చేశాయి. కేంద్రంలో టీడీపీ, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలలో చేరి సహకరించుకున్నాయి. విభజిత ఆంధ్రప్రదేశ్ కు అన్ని విధాలా సహకరిస్తామని బీజేపీ చెప్పడంతో టీడీపీ ఆ పార్టీతో కలిసి పనిచేసింది. అందులో భాగంగానే రాజధాని అమరావతికి నిధుల వర్షం కురుస్తుందని టీడీపీ ఆశించింది. అయితే దాని శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా వచ్చిన ప్రధాని మోదీ మట్టి, నీళ్లు తప్ప చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. అలాగే విభజన చట్టంలోని అంశాలను కూడా తేల్చకుండా నాన్చుతూ వచ్చింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన టీడీపీ.. బీజేపీతో కటీఫ్ చెప్పింది.
అంతేకాక.. విభజన చట్టంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది అప్పటి మన్మోహన్ ప్రభుత్వం. అయితే మోదీ అధికారంలోకి వచ్చాక హోదా స్థానంలో ప్యాకేజీ తెరపైకి తెచ్చింది. హోదా కాకుండా ప్యాకేజీకి అంగీకరించారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్యాకేజీలో భాగంగా కొంతమేర నిధులు కూడా తీసుకున్నారు. అయితే బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత మళ్లీ హోదా కావాలంటూ యూటర్న్ తీసుకుని ధర్మపోరాట దీక్షలు చేపట్టారు. దీంతో చంద్రబాబుపై విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ కూడా ఈ విషయంలో చంద్రబాబు తీరును తప్పుబట్టింది.
ఇప్పుడు ఆ రెండు పార్టీలూ మళ్లీ ఏకతాటిపైకి వచ్చాయి. దీంతో అలాంటి వాటన్నిటికీ ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదనే అసంతృప్తి ఏపీ వాసుల్లో ఉంది. రాష్ట్ర ప్రయోజనాల కంటే వ్యక్తిగత, పార్టీ ప్రయోజనాల కోసమే చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారనే చాలా మంది నమ్ముతున్నారు. జగన్ ఇబ్బందుల నుంచి తప్పించుకునేందుకు, ఎన్నికల మేనేజ్ మెంట్ లో ఈసీ, పోలీస్ వ్యవస్థ సహకారం తీసుకునేందుకే కమలం పార్టీతో చంద్రబాబు కలిశారనేది జనం అనుకుంటున్న మాట. ఇప్పుడు వీటిన్నిటికీ బీజేపీ, టీడీపీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. లేకుంటే ఈ కూటమిని నమ్మే పరిస్థితి లేదు.













