Minister Anitha:దీని వెనుక ఏం జరిగిందో .. ఎవరున్నారో పరిశీలిస్తున్నాం : మంత్రి అనిత

ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా వైసీపీ నేతల్లో మార్పు రాలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) అన్నారు. సచివాలయంలో అనిత మీడియాతో మాట్లాడుతూ అమరావతి ముంపునకు గురైందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, సొంత మీడియాలో విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. అమరావతి (Amaravati )పై వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియాలో మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. ప్రజల్లో అభద్రతాభావం నింపుతున్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగాలని లక్షలాదిగా మహిళలు బయటకు వచ్చి పోరాడారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక్కో ఇటుకా పేర్చుకుంటూ సీఎం చంద్రబాబు (Chandrababu) ముందుకెళ్తున్నారు. అది చూసి ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడేవారిపై రాజద్రోహం కింద కేసులు పెట్టాలి అని అన్నారు.
ప్రకాశం బ్యారేజ్‌లో ఒక్క గేటుకు చిన్న రిపేర్ వస్తే రాద్ధాంతం చేశారు. వైసీపీ సొంత పత్రికలో రోజుకో నకిలీ వార్త రాస్తున్నారు. మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సోషల్ మీడియా పోస్టులపై ప్యాక్ట్ ఫైండిరగ్ కమిటీ ఏర్పాటు చేసి నిజానిజాలు పరిశీలిస్తాం. అనంతరం బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఇలాంటి పోస్టులను అరికట్టేందుకు అవసరమైతే చట్టం తీసుకొచ్చేందుకు కూడా సిద్ధం. తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన శ్రీకాంత్ (Srikanth) ఇప్పటికే నెల్లూరు జిల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. పెరోల్ ఇచ్చిన వారంలోపు రద్దు చేసి జైలుకు పంపాం. పెరోల్ ఎవరు ఇచ్చారనేదానిపై దర్యాప్తు చేపట్టాం. చర్యలు తీసుకుంటాం. దీని వెనుక ఏం జరిగిందో, ఎవరున్నారో పరిశీలిస్తున్నాం. మాజీ సీఎం జగన్ (Jagan) కొందరిని పెంచి పోషించారు. గతంలో ఉన్నట్లే ఇప్పుడు కూడా కొనసాగుతుందని అనుకోవద్దు. అసాంఘిక శక్తులు, ముఠాలు, రౌడీలు జాగ్రత్తగా ఉండాలి. ఇది వైసీపీ ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వమని తెలుసుకోవాలి. అసాంఘిక శక్తులను ఎలా అరికట్టాలో సీఎం చంద్రబాబుకు బాగా తెలుసు అని అన్నారు.