ఏపీ మద్యం కేసు, నిందితుల ఫోన్లు, ట్యాబ్‌ల డేటాపై సిట్ గురి..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన గత ప్రభుత్వ హయాంలోని మద్యం కుంభకోణం కేసు విచారణ ఇప్పుడు నిందితుల డిజిటల్ గ్యాడ్జెట్ల చుట్టూ తిరుగుతోంది. ఈ కేసులో కీలక నిందితులైన రాజ్ కేసీరెడ్డి మరియు బాలాజీ గోవిందప్పలకు సంబంధించిన ఫోన్లు(Mobile Phone), ట్యాబ్‌లను ఓపెన్ చేసేందుకు అనుమతి కోరుతూ సిట్ (SIT) దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది.
మద్యం విక్రయాలు, చెల్లింపులు(Payments) మరియు నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన కీలక సమాచారం నిందితుల మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లలో ఉండే అవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు. అయితే, ఆ గ్యాడ్జెట్లు పాస్వర్డ్ లతో లాక్ చేయబడి ఉండటంతో, వాటిని ఓపెన్ చేయడానికి సాంకేతిక అనుమతి కోరుతూ కోర్టును ఆశ్రయించారు. నిందితులు సహకరించని పక్షంలో, ఫోరెన్సిక్ ల్యాబ్ సహాయంతో డేటాను సేకరించేందుకు ఈ అనుమతి అత్యవసరమని సిట్ పిటిషన్లో పేర్కొంది.
సిట్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై నిందితుల తరపు న్యాయవాదులు స్పందిస్తూ.. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు కొంత సమయం కావాలని కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న విజయవాడ ఏసీబీ కోర్టు, తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. గత ప్రభుత్వ హయాంలో మద్యం కొనుగోళ్లు, డిజిటల్ పేమెంట్స్ కాకుండా కేవలం నగదు రూపంలోనే విక్రయాలు జరపడం ద్వారా వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే రాజ్ కేసీరెడ్డి, బాలాజీ గోవిందప్పలను ప్రధాన నిందితులుగా చేర్చి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఒకవేళ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఫోన్లలోని డేటా ద్వారా ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారుల వివరాలు బయటపడే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి








