అమూల్ కోసమే సంగం డెయిరీపై ఆరోపణలా..?

సంగం డెయిరీపై ఏసీబీ సోదాల వ్యవహారం చినికి చినికి గాలివానలా మారుతోంది. ఆ సంస్థ ఛైర్మన్ ను ఇప్పటికే అరెస్ట్ చేసిన ఏసీబీ.. జైలుకు పంపించింది. నాలుగు రోజులపాటు విస్తృతంగా సోదాలు నిర్వహించిన ఏసీబీ.. పలు కీలక ఆధారాలు సేకరించినట్లు ప్రకటించింది. అనేక అవకతవకలు జరిగాయని వెల్లడించింది. అయితే సంగం డెయిరీ పాలకవర్గం మాత్రం ఏసీబీ ఆరోపణలను తోసిపుచ్చుతోంది. అమూల్ కు లబ్ది చేకూర్చేందుకే సంగం డెయిరీపై ఆరోపణలను చేస్తున్నారని విమర్శిస్తోంది. న్యాయపోరాటం చేస్తామని ప్రకటించింది.
గుంటూరు కేంద్రంగా నడుస్తున్న సంగం డెయిరీకి ఎంతో చరిత్ర ఉంది. లక్షలాదిమంది పాల ఉత్పత్తిదారులు ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా ఇది లాభాలబాటలో పయనిస్తోంది. రాష్ట్రంలో పలు పాల ఉత్పత్తిదారుల సంఘాలు నష్టాలతో మూతపడినా సంగం డెయిరీ మాత్రం దినదినాభివృద్ధి చెందుతూ వస్తోంది. టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర సంగం డెయిరీ ఛైర్మన్ అయిన తర్వాత ఇది మరింత అభివృద్ధి చెందింది. 250 కోట్ల రూపాయలు ఉన్న టర్నోవర్ ను ధూళిపాళ్ల 1100 కోట్ల రూపాయలకు చేర్చారు. ఇప్పటికీ సంగం డెయిరీలోని పాలకవర్గం ధూళిపాళ్ల నేతృత్వాన్నే కోరుకుంటోంది. అనవసర ఆరోపణలతో ధూళిపాళ్లను అరెస్ట్ చేశారని.. దీనిపై న్యాయపోరాటం చేస్తామని ప్రకటించింది. ధూళిపాళ్లను అరెస్ట్ చేయడంతో మంగళవారం సమావేశమైన పాలకవర్గం.. తాత్కాలిక ఛైర్మన్ గా నర్రా వెంకటకృష్ణ ప్రసాద్ ను ఎంచుకుంది.
సంగం డెయిరీపై ఏసీబీ సోదాలు., ధూళిపాళ్ల అరెస్ట్ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించింది పాలకవర్గం. మరోవైపు ధూళిపాళ్ల కూడా తన అరెస్టుపై న్యాయపోరాటం చేస్తున్నారు. కోర్టులో ఈ వ్యవహారం నడుస్తుండగానే ప్రభుత్వం సంగం డెయిరీని గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది మరింత వివాదాస్పదమవుతోంది. అయితే డెయిరీ తాత్కాలిక నిర్వహణకోసమే ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. కానీ ఇది న్యాయవిరుద్ధం అని సంగం డెయిరీ పాలకవర్గం అంటోంది.
రాష్ట్రంలో లాభాలబాటలో పయనిస్తున్న అతికొద్ది పాల ఉత్పత్తిదారుల సంఘాల్లో సంగం ముందుంటుంది. లక్షలాదిమంది ఖాతాదారులు కలిగిన ఈ సంఘంపై ఎంతో మంది నేతల కన్నుంది. దీన్ని చేజిక్కించుకునేందుకు ఎంతోమంది పోటీ పడ్డారు. అయితే ధూళిపాళ్ల వరుసగా ఎన్నికవుతూ వస్తున్నారు. దీన్ని సహించలేని కొంతమంది నేతలు సంగం డెయిరీపై అనేక ఆరోపణలు చేసారు. ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా చేశారు. వీటిని ఆధారాలుగా తీసుకున్న ప్రభుత్వం ఏసీబీని రంగంలోకి దించింది. సోదాలు చేసి ఆరోపణలను నిజాలేనని చెప్పింది. దీంతో ఈ వ్యవహారం పెద్ద దుమారానికే కారణమైంది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకుంది ప్రభుత్వం. అమూల్ కు లబ్ది చేకూర్చేందుకే సంగం లాంటి సంస్థలను నిర్వీర్యం చేసి.. వాటిని అమూల్ కు కట్టబెట్టేందుకే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని పలువురు నేతలు అంటున్నారు. మరి నిజంగానే దీన్ని అమూల్ కు కట్టబెడతారా.. లేదా.. అనేది వేచి చూడాలి.