ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చిన సుప్రీంకోర్టు
స్థానిక ఎన్నికల విషయంలో హైకోర్టు ఉత్తర్వులను సుప్రీం కోర్టులో సవాల్ చేసిన వైసీపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ మొత్తం తప్పుల తడకగా ఉందని, దానిని సరిచేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో పిటిషన్ను వెనక్కిచ్చేసింది. ఈ క్రమంలో మళ్లీ ఈరోజే రిజిస్ట్రీ పిటిషన్ను సరిచేసి దాఖలు చేయకపోవచ్చని వైసీపీ లాయర్లు చెబుతున్నారు. దీనివల్ల సోమవారం (24వ తేదీ) వరకు పిటిషన్ దాఖలు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. అయితే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ మాత్రం ఆదివారమే (ఈ నెల 23న)విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మళ్లీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం లేనట్లేనని తెలుస్తోంది.
పంచాయతీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఎన్నికలను ఆపాలని, హైకోర్టు ఉత్తర్వులు రద్దు చేయాలని సుప్రీంలో ఓ పిటిషన్ దాఖలు చేసింది. వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదంటూ జగన్ సర్కార్ వాదిస్తోంది. కానీ ఇప్పుడు సుప్రీంలో కూడా షాక్ తగలడంతో ఇక ఎటు వెళుతుందో వేచి చూడాలి.













