వరుసగా మూడోసారి అన్నమాట నిలబెట్టుకున్న సీఎం జగన్

వరుసగా మూడోసారి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది జగన్ ప్రభుత్వం. వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం’కింద లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నగదును జమ చేశారు. సముద్రంలో చేపట వేట నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిస్తామని మాట ఇచ్చామని, అన్న మాటను నిలబెట్టుకున్నామని సీఎం జగన్ ప్రకటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నగదు జమ చేశారు. కరోనా సంక్షోభంలోనూ మత్స్యకార భరోసా కొనసాగిస్తున్నామని, అధికారంలోకి రాగానే 2019 లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. కోవిడ్ ఇబ్బందులున్నా, పేద ప్రజలు ఇబ్బంది పడకూడదన్నదే తమ అభిమతమని స్పష్టం చేశారు. వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోతే 10 లక్షల పరిహారం చెల్లిస్తున్నామని, రాష్ట్రంలోని మొత్తం 1,19,875 మత్స్యకార కుటుంబాలను ఈ పథకం ద్వారా ఆదుకుంటున్నామని తెలిపారు.
అదేవిధంగా ఆక్వా సాగు చేసే వారి కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక ఆక్వా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 2,775 కోట్లతో 8 ఫిషింగ్ హార్బర్లను ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. రెండో దశలో మరో నాలుగింటిని ఏర్పాటు చేస్తామని, వీటి ద్వారా 85 వేల మందికి ఉపాధి కలుగుతుందని తెలిపారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీ ఫిషరీస్ వర్శిటీని కూడా ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.