వేడుకగా ఇళ్ళపట్టాల పండుగ
పేదవాడి సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యాన్ని తన భుజాన వేసుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్.. ఆ లక్ష్యసాధనకు పునాది రాయి వేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో ప్రతిష్టాత్మకమైన ఇళ్ళపట్టాల పంపిణీ పథకం లాంఛనంగా ప్రారంభమైంది. దాదాపు 15 రోజుల పాటు ఈ ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా పండుగలా జరుగనున్నాయి. ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలకు శంకుస్థాపనలు రెండు వారాల పాటు వాడవాడలా పండుగలా నిర్వహించేందుకు అధికారులు అన్నీ చోట్లా ఏర్పాటు చేశారు. లబ్ధిదారుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ జగనన్న కాలనీలు చక్కటి వసతులతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నాయి. మన ప్రభుత్వం వస్తే 25 లక్షల ఇళ్ల స్థల పట్టాలు ఇస్తామని ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా విపక్షనేత హోదాలో ప్రకటించిన వైయస్ జగన్.. ముఖ్యమంత్రి అయ్యాక ఏకంగా 30.75 లక్షల మందికి పట్టాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.
వాడవాడలా.. పండుగలా
భారత దేశ చరిత్రలో ఇదివరకెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో 30,75,755 మందికి నివాస స్థల పట్టాలు అందజేయడంతోపాటు వచ్చే మూడేళ్లలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్న వైయస్ జగన్ ప్రభుత్వ లక్ష్యంపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రూ.50,940 కోట్ల అంచనా వ్యయంతో 28.30 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని వచ్చే మూడేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ.28,080 కోట్ల వ్యయంతో మొదటి విడతలో నిర్మించ తలపెట్టిన 15.60 లక్షల ఇళ్లకు వచ్చే నెల ఏడో తేదీ వరకూ ప్రజా ప్రతినిధులు శంకుస్థాపనలు చేస్తారు.
కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా అర్హతే ప్రాతిపదికగా అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో గ్రామ/ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించారు. అర్హుల పేర్లెవరివైనా పొరపాటున మిస్సయితే మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. 68,361 ఎకరాల ప్రభుత్వ, ప్రయివేటు భూమిని సేకరించి పాఠశాలలు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, పార్కులు, వైయస్ఆర్ హెల్త్ క్లీనిక్‌లు, క్రీడా ప్రాంగణాలు లాంటి సామాజిక అవసరాల కోసం స్థలాలను వదిలేసి చక్కగా రహదారులు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 17004 వైయస్ఆర్ జగనన్న కాలనీలను అధికారులు అభివద్ధి చేశారు. ఈ కాలనీల్లో ప్లాట్లను అత్యంత పారదర్శకంగా లాటరీ విధానం ద్వారా కేటాయించారు.
తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు
‘రాష్ట్ర వ్యాప్తంగా నేడు పండుగ జరుగుతోంది. సొంతిళ్లు లేని నిరుపేదల్లో చిరునవ్వు కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 30.75లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలను చేపడుతున్నాం. అమ్మ ఒడి, చేయూత, వసతి దీవెన వంటి పథకాల ద్వారా నేరుగా మహిళలకే నగదు అందిస్తున్నామని అలాగే ఇళ్ళపట్టాలను కూడా మహిళల పేరుమీదనే ఇస్తున్నామని చెప్పారు. ఈ ఇళ్ల పట్టాలను నిరంతర ప్రక్రియగా మార్చామని.. అర్హులైనవారు దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో.. ఇంటి స్థలం కేటాయించేలా ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఇళ్ళపట్టాలు ఇచ్చిన చోట తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ సహా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, లే అవుట్ విస్తీర్ణం బట్టి పార్క్‌లు, అంగన్వాడీలు, విలేజ్ క్లీనిక్‌లు, ఆర్బీకేలు ఏర్పాటు చేస్తామన్నారు. 224 చదరపు అడుగుల నుంచి 340 చదరపు అడుగులకు విస్తీర్ణం పెంచాం. 300 చదరపు అడుగులు ఉన్న టిడ్కో ఇళ్లను ఒక రూపాయికే అందిస్తున్నాం. టిడ్కో ఇళ్లను పూర్తి చేసేందుకు 9వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ‘లక్షా 43వేల మంది టిడ్కో లబ్ధిదారుల్లో ఒక్కరు మాత్రమే చంద్రబాబు స్కీం కావాలన్నారు. 365, 430 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లల్లో.. 50శాతం లబ్ధిదారుల వాటాను ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీనివల్ల ప్రభుత్వంపై 4,250 కోట్ల రూపాయల అదనపు భారం పడుతోంది’ అన్నారు సీఎం జగన్. ఇక ‘ఇళ్ల స్థలాల పంపిణీలో కులం, మతం, పార్టీ వంటి బేధాలు చూడలేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటిని అందిస్తున్నాం. పారదర్శకతలో భాగంగా లబ్దిదారుల జాబితాను గ్రామ సచివాలయంలో పెడుతున్నాం’ అని తెలిపారు.
ఇళ్ల నిర్మాణానికి మూడు ఆప్షన్లు
ఇక ఇళ్ల నిర్మాణానికి మూడు ఆప్షన్లు ఇచ్చామన్నారు సీఎం జగన్. మొదటి ఆప్షన్లో నిర్మాణ సామాగ్రి, లేబర్ ఛార్జీలను లబ్ధిదారు లకు ఇస్తాం. రెండో ఆప్షన్లో నిర్మాణ ఖర్చులను పురోగతి వారీగా డబ్బులు చెల్లిస్తాం. మూడో ఆప్షన్లో పూర్తిగా ప్రభుత్వమే ఇంటి నిర్మాణం చేసి లబ్ధిదారులకు అందిస్తాం అని తెలిపారు. లబ్ధిదారుల పేరుతోనే ఇంటి రిజిస్ట్రేషన్ చేయించాలనుకున్నాం అన్నారు. ప్రస్తుతం లబ్ధిదారులకు కేవలం ‘డి’ పట్టాలు మాత్రమే ఇస్తున్నామని.. న్యాయపరమైన చిక్కులు తొలగిపోగానే లబ్ధిదారులకు అన్ని హక్కులు కల్పిస్తామన్నారు.
రికార్డుగా మారనున్న ఇళ్ళపట్టాల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇళ్ల పట్టాలను ప్రదానం చేయ డాన్ని ప్రారంభించారు. రెండు వారాల్లో ఈ కార్యక్రమం పూర్తయ్యేలా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంత స్వల్పకాలంలో ఇన్ని లక్షలమందికి ఇళ్ల పట్టాలివ్వడమే ఒక ప్రపంచ రికార్డు. దానికితోడు ఆ పట్టాలన్నీ మహిళల పేరుమీదనే ప్రదానం చేయడం విశేషమని చెబుతున్నారు. పట్టాలిచ్చిన చోట ప్రభుత్వమే మరో మూడేళ్లలో నయాపైసా ఖర్చులేకుండా ఇళ్లను నిర్మించి ఇవ్వబోతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడిదొక పెద్ద సందడి. గొప్ప పండుగ సందడి. క్రిస్మస్, వైకుంఠ ఏకాదశితో ప్రారంభమై సంక్రాంతి సీజన్ వరకు రెండు వారాలపాటు ఇళ్ల పండుగ కొనసాగబోతున్నది. వైఎస్సార్ జగనన్న కాలనీల పేరుతో రూపొందుతున్న ఈ ఇళ్లు నిజానికి కాలనీలు మాత్రమే కాదు.. కొత్త ఊళ్లు. ఇంటి స్థలాలను రిజిస్ట్రేషన్ చేయడమే కాదు, ఇళ్లను నిర్మించి ఇవ్వడం, మౌలిక సదుపాయాలన్నింటినీ ప్రభుత్వ ఖర్చుతో కల్పించడం ద్వారా 17,005 కొత్త ఊళ్లనే జగన్ ప్రభుత్వం నిర్మించబోతున్నది. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో కలిపి ఇప్పటికే ఉన్న గ్రామాల సంఖ్య 17,128. అంతకు సమానమైన సంఖ్యలో కొత్త గ్రామాల నిర్మాణాన్ని ప్రభుత్వం తలకెత్తుకున్నది.













