డేటా చౌర్యంపై ఏపీ కేబినెట్ భేటీలో కీలక చర్చ!
ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఎజెండా అంశాలతో పాటు రాజకీయ అంశాలపైనా ఈ భేటీలో కీలక చర్చ జరిగింది. సమాచార చౌర్యం, తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపైనా ప్రధానంగా చర్చించారు. సమాచార చౌర్యం అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని, ఈ కేసులో ఎలా ముందుకెళ్లాలనే విషయంపైనా చర్చించారు. ఈ వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు మాట్లాడాలని సీఎం మంత్రులకు చెప్పినట్టు సమాచారం. అంతేకాకుండా వీటిపై న్యాయపరంగా ఉన్న అవకాశాలనూ పరిశీలించాలని సూచించారు. ఓట్ల తొలగింపు అంశం సైతం మంత్రివర్గంలో ప్రస్తావనకు వచ్చింది. ఏపీ ప్రయోజనాలను దెబ్బతీసే కుట్రలను తిప్పికొడతామని మంత్రివర్గం స్పష్టంచేసింది. పొరుగు రాష్ట్రం అనుసరిస్తున్న తీరుపై తీవ్రంగా ఆక్షేపించింది. తెలంగాణ ప్రభుత్వం తీరును తేలిగ్గా వదలొద్దని నిర్ణయించారు. మంత్రులు, సీనియర్లతో చర్చించి కార్యాచరణ రూపొందిద్దామని సీఎం స్పష్టంచేశారు. తెదేపా డేటాను దొంగిలించి ప్రత్యర్థులకు అప్పగించారని.. దాన్ని కప్పిపుచ్చుకొనేందుకే దుష్ప్రచారం చేస్తున్నారని అమాత్యులు మండిపడ్డారు. ఎవరో ఇచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర పోలీసులపై మరో రాష్ట్ర పోలీసులు ఎలా కేసులు పెడతారని ప్రశ్నించారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ చేసిన వ్యాఖ్యలపైనా ఈ భేటీలో పలవురు ప్రస్తావించారు.
తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలపై చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. కేవలం కోర్టుల్లో కేసులు వేసి ఊరుకోకుండా వాటిని ఫాలో అప్ చేసి ఎట్టి పరిస్థితుల్లో వాటిని సాధించే దిశగా దిశానిర్దేశం చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి ఎద్దడి లేకుండా తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై కీలక సూచనలు చేశారు. అలాగే అగ్రిగోల్డ్ వ్యవహారంపైనా కీలక చర్చ జరిగినట్టు సమాచారం. అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మగా వచ్చిన రూ.250కోట్లను రూ.10వేల లోపు డిపాజిట్దారులకు పారదర్శకంగా కోర్టు ఆదేశానుసారం పంచాలని నిర్ణయించారు.













