దేశంలోనే ఆంధప్రదేశ్ రికార్డు…
కరోనా వ్యాక్సిన్ వేయడంలో దేశంలోనే ఆంధప్రదేశ్ రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా 31.39 లక్షల మందికి వ్యాక్సిన్ వేయగా, అందులో ఒక్క ఆంధప్రదేశ్లోనే 6.40 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. ఆంధప్రదేశ్ రాష్ట్రంలో 6.40 లక్షల డోసుల్లో 4.40 లక్షల డోసులు కోవిషీల్డ్, 2 లక్షల డోసులు కోవాగ్జిన్ ఉన్నాయి. 45 ఏళ్ల దాటిన వారి నుంచి ఆపై వయస్ను వారికి వ్యాక్సిన్ వేశారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో జరిగిన వ్యాక్సినేషన్లో ఆంధప్రదేశ్దే రికార్డు అని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. క్షేత్ర స్థాయిలో సిబ్బందిని బలోపేతం చేసుకోవడం వల్లే ఈ స్థాయిలో వ్యాక్సిన్ వేయడం సాధ్యమైందని వైద్యు నిపుణులు చెబుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో పీహెచ్సీ పరిధిలోని ఒక్కో గ్రామ, వార్డు సచివాలయంలో టీకా పక్రియ కొనసాగించారు. మొత్తం 1,145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 255 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని సచివాలయాల్లో వ్యాక్సిన్ వేశారు. ఈ నెల 13న రాష్ట్రానికి వచ్చిన 6.40 లక్షల డోసుల వ్యాక్సిన్ను ఒకే రోజు జిల్లాలకు, అక్కడ నుంచి పీహెచ్సీలకు, అక్కడ నుంచి గ్రామ, వార్డు సచివాలయాలకు చేర్చారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు టీకా పక్రియ కొనసాగించారు. ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్లు, సిబ్బంది సహకారంతో రికార్డు స్థాయిలో వ్యాక్సిన్ వేయగలిగారు.







