ఏపీలో మళ్లీ పాదయాత్ర చేయనున్న వైఎస్ జగన్.. అధికారిక ప్రకటన
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. వచ్చే యేడాది నుంచి రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు. పాదయాత్రతో ప్రజలతో మమేకం అవుతానని తెలిపారు. తాడేపల్లి నియోజకవర్గం వైసీపీ నేతలతో వైఎస్ జగన్ పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే తన పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా పాదయాత్రపై జగన్ మాట్లాడుతూ ‘‘వచ్చే యేడాది నా పాదయాత్ర వుంటుంది. పాదయాత్రలో ప్రజలతో మమేకం అవుతాను. నా పాదయాత్ర ప్రారంభమైన తర్వాత వైసీపీ శ్రేణులు సీఎం చంద్రబాబుకి ప్రతిరోజూ సినిమా చూపించడం ఖాయం’’ అని అన్నారు.
దోచుకో, పంచుకో, తినుకో అనే కాన్సెప్ట్ తో చంద్రబాబు పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఎప్పటిలాగే చంద్రబాబు తెచ్చిన మేనిఫెస్టో చెత్త బుట్టలోకి వెళ్లిపోయిందని, తమ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన పథకాలన్నీ చంద్రబాబు రద్దు చేశారని మండిపడ్డారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారని, రాష్ట్రం అన్ని రంగాల్లోనూ తిరోగమనంలో కనిపిస్తోందన్నారు.
తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా పాదయాత్ర ద్వారానే అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత వైఎస్ జగన్ కూడా సుదీర్ఘ పాదయాత్ర చేసి, అన్ని వర్గాలను కలుస్తూ, సమావేశాలు, సభలు నిర్వహించారు. 2017 లో ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్ర నిర్వహించారు. 341 రోజుల పాటు 3648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.
ఈ యాత్రకు ‘‘ప్రజా సంకల్ప యాత్ర’’ అన్న పేరుతో చేశారు. దీని తర్వాతే 151 స్థానాల్లో జగన్ భారీ విజయం సాధించారు. 2017 లో కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర, 2019 జనవరి 9 న ఇచ్ఛాపురంలో ముగించారు. నవ రత్నాల పథకం ద్వారా ప్రజల్లోకి వెళ్లారు. రైతు భరోసా, ప్రత్యేక హోదా, మద్యపాన నిషేధం వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు.
ఇప్పుడు తాజాగా మళ్లీ పాదయాత్ర చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు. అయితే ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది? ఎక్కడ ముగుస్తుంది? ఎన్ని కిలోమీటర్లు అన్న దానిపై మాత్రం ఇంకా ప్రకటన రాలేదు.








