మన బడ్జెట్ కు 400 ఏండ్ల చరిత్ర!
మొదట ప్రవేశపెట్టింది అక్బర్ సామ్రాజ్యంలోని రాజా తోడర్మల్
బడ్జెట్.. దేశాన్ని నడిపించే ఓ కీలక సాధనం. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న బడ్జెట్ ఎలా మొదలైంది? ఎవరు మొదలుపెట్టారు? అసలు బడ్జెట్ అనే పేరు ఎలా వచ్చిందంటే.. బడ్జెట్ అనే పదం ఫ్రెంచ్ పదం బోగెట్టి నుంచి వచ్చింది. బోగెట్టి అంటే సంచి అని అర్థం. దాదాపు 400 ఏండ్ల కిందట అక్బర్ సామ్రాజ్యంలోని ఆర్థిక మంత్రి రాజా తోడర్మల్ మొదటి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ రాబడి, వ్యయానికి సంబంధించిన బడ్జెట్ ప్రతులను ఆయన ఓ సంచిలో తీసుకొని దర్బార్ హాల్‌కు వెళ్లేవారు. అలా మొదలైన భారత బడ్జెట్ నిరంతరంగా కొనసాగుతున్నది. అయితే ప్రభుత్వ రాబడి, వ్యయాలు తదితర విషయాలు అప్పటి నుంచి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. కానీ, మారుతున్న కాలానుగుణంగా బడ్జెట్ సంచి స్థానంలో సూట్‌కేస్ వచ్చింది.
అప్పటి బడ్జెట్‌తో ప్రస్తుత బడ్జెట్‌ను పోల్చిచూస్తే..
-అప్పట్లో ప్రభుత్వ రాబడికి ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు. ఇప్పటికీ కూడా ఈ రంగం కీలక పాత్ర పోషిస్తున్నది.
-అప్పట్లో బడ్జెట్ ప్రతులను చేతితో రాసేవారు. ఇప్పుడు ముద్రిస్తున్నారు.
-రాజా తోడర్మల్ మొదట షేర్ షా సూరి వద్ద పనిచేశారు. అప్పుడు రాజ్యానికి వచ్చే రాబడులను ఆయన ఎక్కువగా మౌలికసదుపాయాలకు ఖర్చు చేసేవారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం మౌలికసదుపాయాలకు పెద్దపీట వేస్తున్నది. టోల్ ట్యాక్స్‌ను మొదట ప్రవేశపెట్టిన వ్యక్తి రాజా తోడర్మల్.
-వెండి, బంగారం, రాగి నాణేలు చెలామణిలోకి వచ్చింది కూడా రాజా తోడర్మల్ హయాంలోనే.. రూపాయి అనే పదం రూపాయా అనే పదం నుంచి వచ్చింది.
-అప్పట్లో రక్షణ రంగానికి భారీగా నిధులు కేటాయించేవారు. ఇప్పుడూ ఎక్కువగానే నిధులు కేటాయిస్తున్నారు.













