Trump: చమురు ధర పెరిగితే మనకే లాభమంటున్న ట్రంప్…!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్…చమురు ధరల పెంపును నియంత్రించడంలో విఫలమవుతున్నారా..? తామిక ముడిచమురు మార్కెట్ శాసించలేమన్న అభిప్రాయానికి వచ్చేశారా..? ప్రస్తుతం ట్రంప్ వాదన చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. ప్రపంచమంతా పెరిగిన ఇంధన ధరలతో ఇబ్బందులు పడుతుంటే.. అది మనకు ఓ చక్కని బిజినెస్ స్ట్రాటజీ అంటున్నారు ట్రంప్. చమురు ధర పెరిగితే మనకే లాభం.. మనమెందుకు బాధపడాలి అన్నట్లుగా ఉంది ట్రంప్ వాదన.
పశ్చిమాసియాలో ఇరాన్‌తో యుద్ధం తీవ్రమవుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వ్యూహాన్ని మార్చారు. గతంలో తక్కువ గ్యాస్ ధరలు తన విజయమని చెప్పుకున్న ఆయన, ఇప్పుడు పెరుగుతున్న చమురు ధరలు దేశ ఆర్థిక వ్యవస్థకు లాభదాయకమని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.
పెరుగుతున్న ధరలపై తన సోషల్ మీడియాలో స్పందించిన ట్రంప్ “అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు. కాబట్టి ధరలు పెరిగితే మనకే ఎక్కువ డబ్బు వస్తుంది” అని పేర్కొన్నారు. అయితే, ఒక ‘దుష్ట సామ్రాజ్యం’ అయిన ఇరాన్‌ను అణ్వస్త్ర శక్తిగా మారకుండా నిరోధించడమే అన్నిటికన్నా ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచాన్ని అణు ముప్పు నుంచి కాపాడటమే తన ప్రథమ కర్తవ్యమని ట్రంప్ నొక్కి చెప్పారు.
ప్రస్తుతం హర్మూజ్ జలసంధి మూసివేత, యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటింది. నవంబర్‌లో జరగనున్న మధ్యంతర ఎన్నికల ముందు అమెరికాలో గ్యాస్ ధరలు 50 శాతానికి పైగా పెరగడంతో ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతోంది. ఈ ఒత్తిడిని పక్కనపెట్టి, ఇరాన్‌పై యుద్ధాన్ని నిర్ణయాత్మక దశకు తీసుకెళ్లడమే లక్ష్యమని ట్రంప్ సంకేతాలిస్తున్నారు. గతంలో తక్కువ ధరలను రాజకీయ అస్త్రంగా వాడుకున్న ఆయన, ఇప్పుడు అధిక ధరలను ఆర్థిక అవకాశంగా చూపడం వ్యూహాత్మక మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు.








